గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత రీతిలో టీమిండియా టెస్ట్ సిరీస్ సాధించిన విషయం ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. ఈ సిరీస్ విజయం సాధించడంలో తాత్కాలిక కెప్టెన్ రహానె కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ విజయానికి తన నిర్ణయాలు కారణమైతే.. మరొకరు తమ ఘనతగా చెప్పుకున్నారని రహానె విమర్శించాడు. అడిలైడ్ టెస్టులో 36 పరుగులకే ఆలౌట్ కావడం, ఆ మ్యాచ్ తర్వాత కోహ్లీ స్వదేశానికి తిరిగి రావడం, పలువురు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడినా క్లిష్ట పరిస్థితుల్లో జట్టు పగ్గాలను చేపట్టిన రహానె.. యువ ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపిన తీరు ప్రశంసనీయం. మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీతో కదంతొక్కి జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. ఆనాటి విజయంతో అప్పటి కోచ్ రవిశాస్త్రిని మీడియా ఆకాశానికెత్తేసింది.
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా సిరీస్ విజయం సాధించడాన్ని తాను కాకుండా మరొకరు గొప్పగా చెప్పుకున్నారని మాజీ కోచ్ రవిశాస్త్రిని ఉద్దేశించి రహానె తాజాగా విమర్శలు చేశాడు. ఆస్ట్రేలియాలో ఏం చేశానో తనకు తెలుసు అని.. దాని గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదని రహానె వ్యాఖ్యానించాడు. మరొకరి ఘనతను తీసుకునే స్వభావం తనది కాదన్నాడు. మైదానంలో, డ్రెస్సింగ్ రూంలో కొన్ని విషయాలపై తాను నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవమని.. కానీ ఆ ఘనతనే వేరొకరు తీసుకున్నారని.. అయితే తాము సిరీస్ గెలిచామన్నదే తనకు ముఖ్యమని.. అదొక చారిత్రక సిరీస్ అని రహానె అభిప్రాయపడ్డాడు. ‘అది నేనే చేశాను.. ఫలానా మలుపుకు నేనే కారణం’ అని వేరొకరు గొప్పగా చెప్పుకున్నారని.. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాని ఎద్దేవా చేశాడు. తన సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని.. తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని రహానె స్పష్టం చేశాడు.