భారత దేశానికి ఎన్నో గొప్ప పతకాలు అందించి, దేశ ఖ్యాతిని చాటిచెప్పిన హాకీ దిగ్గజ క్రీడాకారుడు వరీందర్ సింగ్ (75) అనారోగ్యంతో మంగళవారం నాడు కన్నుమూశారు. 1970లలో దేశం సాధించిన గొప్ప విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఒలింపిక్, ప్రపంచకప్ పతక విజేత వరీందర్ సింగ్ ఇక లేరన్న విషయం తెలుసుకుని క్రీడా ప్రపంచం ఆవేదన చెందుతోంది. 1975 కౌలాలంపూర్ ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో వరీందర్ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. ఫైనల్‌లో 2-1తో పాకిస్థాన్‌ను మట్టికరిపించి ఆ ఏడాది భారత్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారతదేశం పాకిస్థాన్‌ను 2-1తో ఓడించి సాధించిన ఏకైక స్వర్ణ పతకం ఇదే.
Read Also:IND Vs IRE: చరిత్ర సృష్టించిన దీపక్ హుడా-సంజు శాంసన్ జోడీ
అంతకుముందు మ్యూనిచ్‌లో జరిగిన 1972 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, 1973 ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న జట్లలో కూడా వరీందర్ సింగ్ ఆడారు. అతను 1974, 1978లో వరుసగా ఆసియా క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకున్నారు. ఈ భారత దిగ్గజ హాకీ క్రీడాకారుడు 1975లో మాంట్రియల్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు. గౌరవనీయమైన ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 2007లో వరీందర్ సింగ్ అందుకున్నారు.