ఐర్లాండ్ పర్యటనను హార్డిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు విజయంతో ముగించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో 4 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. అయితే అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించిందంటే దానికి కారణం దీపక్ హుడా, సంజు శాంసన్ జోడీనే.
ఆదిలోనే ఇషాన్ కిషన్ 3 పరుగులకే అవుటైనా.. స్కోరు బోర్డును హుడా-శాంసన్ జోడీ పరుగులు తీయించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 87 బంతుల్లోనే 176 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీ20ల్లో టీమిండియా తరఫున ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. గతంలో శ్రీలంకపై 2017లో రోహిత్-రాహుల్ జోడీ 165 పరుగులు చేసింది. అంతకుముందు రోహిత్-ధావన్ జోడీ 160 పరుగులు చేయగా, రోహిత్-ధావన్ జోడీ158 పరుగులు చేసింది. కాగా దూకుడుగా ఆడటం తనకు ఇష్టమని… బ్యాటింగ్‌కు ముందుగానే రావడంతో తనకు సమయం దొరికిందని దీపక్ హుడా తెలియజేశాడు. ఈ మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడానని.. సంజూ శాంసన్ తనకు చిన్ననాటి మిత్రుడు అని.. తామిద్దరం కలిసి అండర్-19 క్రికెట్ కలిసి ఆడామని హుడా తెలిపాడు. ఈ మ్యాచ్‌లో సంజూ కూడా భారీ స్కోరు చేయడంతో తనకు ఆనందంగా ఉందని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటున్న సమయంలో హుడా వివరించాడు.
Read Also: IND Vs IRE: పోరాడి ఓడిన ఐర్లాండ్.. టీమిండియాదే సిరీస్
కాగా ఈ ఏడాది టీమిండియా వరుస మ్యాచ్‌లతో బిజీబిజీగా గడపనుంది. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 18 నుంచి 30 వరకు మూడేసి టీ20లు, వన్డే మ్యాచ్‌లలో కివీస్‌తో భారత్ తలపడనుంది. నవంబర్ 18న వెల్లింగ్టన్, 20న టురంగా, 22న నేపియర్‌లో టీ20లు, 25న ఆక్లాండ్, 27న హామిల్టన్, 30న క్రైస్ట్‌చర్చ్‌లో వన్డేలు జరుగుతాయి. బదులుగా వచ్చే ఏడాది జనవరిలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో న్యూజిలాండ్ పర్యటించనుంది.