IPL లో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి మాత్రం కనీసం ప్లేఆఫ్స్ కు కూడా అర్హత సాధించలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడిన CSK కేవలం 4 మాత్రమే గెలిచి, లీగ్ స్టేజీలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక IPL ముగిసిన తర్వాత ధోని తన స్వస్థలం జార్ఖండ్ కు వెళ్లిపోయాడు. అయితే ధోని ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. మహీపై బీహార్ లో FIR నమోదైంది. చెక్ బౌన్స్ అయిన కేసులో ధోని పేరును FIR లో చేర్చారు. ఓ ఎరువుల తయారీ సంస్థకు చెందిన కేసులో ధోని అనవసరంగా ఇరుక్కున్నట్టయింది.
ధోని.. టీమిండియా కెప్టెన్‌గా పనిచేసినప్పుడు బీహార్ కు చెందిన న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు ప్రమోటర్ గా ఉన్నాడు. ఇదొక ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేసే సంస్థ. SK ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ.. న్యూఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ నుంచి రూ. 30 లక్షలు విలువ చేసే ఎరువులు కొనుగోలు చేసింది. న్యూఇండియా సంస్థ వాటిని డెలివరీ కూడా చేసింది.
అయితే ఈ ఎరువులలో నాణ్యత లోపం ఉందని, డీలర్ ప్రొవైడర్ కు అనుగుణంగా లేదని, వాటిలో చాలా వరకు అమ్ముడుపోలేదని SK ఎంటర్ ప్రైజెస్ ఆరోపించింది. ఆ తర్వాత ధోని ప్రమోట్ చేసిన సంస్థ.. ఆ ఎరువులను వాపసు తీసుకుని, రూ. 30 లక్షల చెక్కును ఏజెన్సీకి అందజేసింది. ఆ చెక్కును బ్యాంకులో వేయగా అది కాస్త బౌన్స్ అయింది.
దీంతో సదరు సంస్థ న్యూఇండియా గ్లోబల్ సంస్థ కు ప్రమోటర్ గా ఉన్న ధోనితో పాటు మరో ఏడుగురికి లీగల్ నోటీస్ పంపింది. తాజాగా వారి పేర్లను FIR లో కూడా చేర్చారు. ఈ కేసును విన్న బెగుసరాయ్ కంజ్యూమర్స్ కోర్టు.. దీనిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కు పంపింది. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 28న జరుగుతుంది.ధోని కేవలం ఈ ఎరువుల కోసం ప్రచారం చేశాడు. ఈ సందర్భంలో నీరజ్ కుమార్ నిరాలా ధోనిపై కేసు పెట్టారు. ఈ కేసులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును చేర్చడంతో ఈ కేసు వార్తల్లో నిలిచింది.