అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో తుఫాన్ ఇన్నింగ్స్‌లు ఆడుతున్న టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై మాజీ భారత బ్యాటర్ మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కన్నా అభిషేక్ విధ్వంసకరమైన ఆటగాడని పేర్కొన్నారు. అభిషేక్ ఆడితే భారత్ గెలవడం ఖాయం అని, టీమిండియాకు దొరికిన ఆణిముత్యం అని అని కైఫ్ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడవ టీ20లో అభిషేక్ చెలరేగాడు. 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సులతో 68 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో 271.43 స్ట్రైక్ రేట్, 76.00 సగటుతో 152 పరుగులు చేశాడు.
మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ.. అగ్రెసివ్ ఓపెనర్స్, అభిషేక్ శర్మ మధ్య తేడా ఏమిటో వివరించారు. ‘సాధారణంగా దూకుడుగా ఆడే బ్యాటర్లకు నిలకడ, ఫామ్ ఉండదు. చాలామంది సీనియర్ ప్లేయర్లను నేను చూశాను. క్రిస్ గేల్ ఇలాగే భారీ షాట్లు కొడతాడు. కానీ అతడు స్మార్ట్ క్రికెట్ ఆడేవాడు. మొదటి ఓవర్లలో చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసేవాడు. అవసరం అయితే మెయిడిన్ ఓవర్లూ ఆడేవాడు. ఆ తర్వాత వేగం పెంచేవాడు. బెంగళూరు లాంటి పిచ్‌ల మీద నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించి.. తర్వాత వేగం పెంచేవాడు’ అని కైఫ్ అన్నాడు.
‘అభిషేక్ శర్మ మొదటి బాల్ నుంచే అటాక్ చేస్తాడు. ఇలా ఆడే బ్యాటర్లకు సాధారణంగా నిలకడ ఉండదు. ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే.. ఆ తర్వాత విఫలవుతారు. కానీ అభిషేక్ ప్రతి మ్యాచ్‌లో చెలరేగుతున్నాడు. 12–14 బాల్స్ ఆడినా 60–70 పరుగులు చేస్తున్నాడు. అదే అతడిని మాచ్-విన్నర్‌గా మార్చుతుంది. అభిషేక్ ఆడితే భారత్ గెలవడం ఖాయం’ అని మహమ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించారు. మూడవ టీ20లో అభిషేక్ అద్భుత ఇన్నింగ్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 102 పరుగుల పార్ట్‌నర్‌షిప్ నిర్మించి.. జట్టుకు 10 ఓవర్లలో విజయం అందించాడు.
Also Read: IND vs NZ 4th T20: అతడు నంబర్ 1 బౌలర్.. రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదు!
క్రిస్ గేల్ తరహా లెఫ్ట్ హ్యాండెడ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. పవర్ ప్లేలో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ దూకుడే అతడిని ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. 25 ఏళ్ల వయసులో ఇలా ఆడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 36 టీ20ల్లో 38.39 సగటు, 195.22 స్ట్రైక్ రేట్‌తో 1,267 పరుగులు చేశాడు. ఇప్పటికే 8 ఫిఫ్టీస్, 2 సెంచరీస్ సాధించిన అభిషేక్.. భారత్‌కి రేర్, రెలయబుల్ డెస్ట్రాయర్‌గా మారాడు. టీ20 ప్రపంచకప్ 2026లో అభిషేక్ ఆట టీమిండియాకు విజయాలు అందించనుంది.