Kane Williamson Press Conference After Losing Against Pakistan: టీ20 వరల్డ్‌కప్ మెగా టోర్నీలో సూపర్-12లో న్యూజీల్యాండ్ జట్టు అదరగొట్టడంతో.. సెమీఫైనల్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించి, ఫైనల్స్‌కి చేరుకోవడం ఖాయమని అంతా ఊహించారు. కానీ, అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ కివీస్ జట్టుని చిత్తూ చేసి, పాక్ అద్భఉతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో మొదటి నుంచీ ఫామ్‌లో లేని బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్‌లో అర్థశతకం చేయడం, ఓపెనర్ రిజ్వాన్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో.. పాక్ జట్టు సునాయాసంగా గెలుపొందింది.
ఈ ఓటమిపై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆరంభంలోనే బాబర్, రిజ్వాన్ తమను ఒత్తిడిలోకి నెట్టేయడంతో.. తమకు వికెట్ తీయడం కఠినంగా మారిందని అన్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని ఉద్వేగానికి లోనయ్యాడు. ‘‘పాక్ జట్టు నిజంగా బాగా ఆడింది. ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ ఇద్దరూ మమ్మల్ని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. ఆ ఇద్దరి వల్ల వికెట్ తీయడం కఠినంగా మారింది. ఈ మ్యాచ్‌లో మా ఆట అస్సలు బాగాలేదు. ఏదేమైనా ఈ విజయానికి వాళ్లు అర్హులు. టోర్నీ ఆసాంతం మేము బాగానే ఆడాం కానీ, కీలక మ్యాచ్‌లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శన కనబరచలేకపోయాం. అయినా.. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా’’ అని కేన్ చెప్పుకొచ్చాడు.
ఇక పాకిస్తాన్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసిందని.. అయితే మిచెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో తమని తిరిగి పుంజుకునేలా చేశారని కేన్ తెలిపాడు. తాము ఇంకాస్త మెరుగైన స్కోరును నమోదు చేస్తామని భావించామని.. కానీ పాక్ బౌలర్లను ఎదుర్కోలేకపోయామని విచారం వ్యక్తం చేశాడు. కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీల్యాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడటంతో.. 19.1 ఓవర్లలో ఏడు వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి, ఫైనల్‌కి చేరుకుంది.