Jos Buttler Says MS Dhoni and Virat kohli is my inspiration: భారత బ్యాటింగ్ దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే తనకు ఇన్స్పిరేషన్ అని ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ తెలిపాడు. ధోనీ, కోహ్లీలను చూసే చివరి వరకు క్రీజులో ఉండటం తాను నేర్చుకున్నాడన్నాడు. తాను ఎక్కువగా గోల్ఫ్ చూస్తానని, మాక్స్ హోమ్స్ అనే వ్యక్తిని బాగా ఫాలో అవుతానని చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడకుండా నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకోవద్దని శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర చెప్పారని బట్లర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 రన్స్ చేశాడు.
సెంచరీ చేసిన జోస్ బట్లర్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. ఈ సందర్భంగా బట్లర్ మాట్లాడుతూ… ‘ఈరోజు నేను బాగా ఆడడానికి ప్రధాన కారణం.. నాపై నాకున్న నమ్మకమే. కొన్నిసార్లు లయ అందుకునేందుకు నేను ఇబ్బంది పడుతుంటాను. నేను గోల్ఫ్ చూస్తాను. అందులో మాక్స్ హోమ్స్ అనే వ్యక్తిని ఫాలో అవుతా. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వచ్చినప్పుడు.. వాటికి భిన్నంగా ఆలోచించడం మొదలుపెడుతా. అదే ఈరోజు నన్ను ముందుకు నడిపించింది. నిరాశకు గురైనపుడు.. నేను బాగానే ఉన్నానని నాకు నేనే చెప్పుకుంటా, దాంతో లయను తిరిగి పొందుతా. అంతేకాదు ఎప్ప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తా’ అని తెలిపాడు.
Also Read: Jos Buttler Record: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ‘కింగ్’ కోహ్లీ రికార్డు బద్దలు!
‘ఐపీఎల్‌లో భిన్నమైన పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా క్రీజులో చివరి వరకు నిలబడాలనే విషయాన్ని మాత్రం ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలను చూసి నేర్చుకున్నా. నేను కూడా వారిలాగే ఆడడానికి ప్రయత్నిస్తున్నా. రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర నాకు ఓ విషయం చెప్పాడు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు పోరాడకుండా చెత్త షాట్‌తో వికెట్ పారేసుకోవద్దన్నాడు. క్రీజులో ఉండేందుకు చివరివరకు ప్రయత్నించని చెప్పాడు. ఒక్క షాట్‌తో మూమెంటమ్, రిథమ్ దొరకుతుందని సంగా చెప్పాడు. గత కొన్ని సంవత్సరాలుగా నా ఆటలో మార్పు వచ్చింది. చివరి బంతికి విజయం సాధించడం సంతోషంగా ఉంటుంది’ అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు.