Glenn Maxwell Take A Break From IPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ నుంచి కొన్ని రోజలు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మ్యాక్సీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌కు అతడు మళ్లీ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నదానిపై స్పష్టత లేదు. ఐపీఎల్ 2024లో మ్యాక్స్‌వెల్ ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విషయం తెలిసిందే.
మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాట్లాడుతూ… ‘వ్యక్తిగతంగా ఇది నాకు తేలికైన నిర్ణయం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు నేను కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, కోచ్‌ల వద్దకు వెళ్లాను. నా బదులు మరో ఆటగాడిని తీసుకోవాలని చెప్పా. కొంతకాలంగా ఫామ్ కోల్పోయా. నేను గతంలో పరిస్థితిని ఎదుర్కొన్నా. పవర్‌ప్లే తర్వాత మా జట్టు వైఫల్యాలను ఎదుర్కొంటోంది. బ్యాట్‌తో నేను రాణించలేకపోతున్నా. విజయాలను అందించలేకపోయా. మరొకరికి అవకాశం ఇవ్వడానికి ఇది మంచి సమయం అని నేను భావిస్తున్నాను’ అని అన్నాడు.
Also Read: Singapore PM: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న లారెన్స్ వాంగ్!
‘నేను మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. బ్రేక్ తీసుకుంటేనే నేను ఫిట్‌గా తిరిగొస్తా. నా స్థానంలో ఆడే వారు తప్పకుండా రాణిస్తారని ఆశిస్తున్నా. ఒకవేళ టోర్నమెంట్‌లో నా అవసరం ఉంటే తప్పకుండా తిరిగొస్తా’ అని గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెప్పాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ.. కేవలం 32 పరుగులే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు ఉన్నాయి. హైదరాబాద్‌తో మ్యాచ్ నుంచి మ్యాక్స్‌వెల్ స్వయంగా తప్పుకోగా.. అతడి స్థానంలో విల్ జాక్స్ ఆడాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచిన బెంగళూరు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.