Gujarat Titans Captain Shubman Gill on Impact Player: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు ఇన్నింగ్స్ చివరి వరకు విరుచుకుపడుతున్నారని, అందుకే ఐపీఎల్ 2024లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అభిప్రాయపడ్డాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొనేందుకు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో బ్యాటర్లకు అదనపు శక్తి లభిస్తోందన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై కొన్ని ఎక్స్‌ట్రాలు ఇవ్వడం కూడా తమ ఓటమికి ఓ కారణం అని గిల్ అంగీకరించాడు. ఢిల్లీపై గుజరాత్ బ్యాటర్లు బాగా ఆడినా 4 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.
మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ… ‘మేము చాలా మంచి క్రికెట్ ఆడామని నేను అనుకుంటున్నాను. చివరికి ఓడిపోవడం మాత్రం నిరాశపరిచింది. ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేశారు. చివరి వరకు గొప్ప పోరాటం చేశాం. ఏ దశలోనూ మేం ఓడిపోతామనుకోలేదు. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేటప్పుడు ప్రణాళికల గురించి మాట్లాడుకోవడం అనవసరం. పరుగులు సాధించడంపై దృష్టి సారించాలి. భారీ స్కోర్లు నమోదవడంతో ఇంపాక్ట్ ప్లేయర్ పాత్ర ఉందని నేను భావిస్తున్నాను. ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడనే ధైర్యంతోనే బ్యాటర్లు చివరి వరకు విరుచుకుపడుతున్నారు’ అని గిల్ అన్నాడు.
Also Read: Rishabh Pant: అతడిపై నమ్మకం ఉంచాం.. ప్లాన్ వర్కౌట్ అయింది: పంత్
‘ఓ దశలో మేం ఢిల్లీని 200-210 పరుగులకు కట్టడి చేయొచ్చని అనుకున్నాం. కాని మేము చివరి 2-3 ఓవర్లలో అదనపు పరుగులు ఇచ్చాము. రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌ను అడ్డుకోవటంలో విఫలమయ్యాం. కొన్ని ఎక్స్‌ట్రాలు ఇవ్వడం కూడా మా ఓటమికి ఓ కారణం. ఇది చిన్న మైదానం. ఇదే విషయాన్ని మేం చేదించేటప్పుడు చర్చించాం. దేనికైనా ఎగ్జిక్యూషన్ చాలా ముఖ్యం. సెటిల్ బ్యాటర్ లేదా ఫినిషర్ ఉంటే.. మ్యాచ్ ముగించేయొచ్చు. ఏ వికెట్‌పై అయినా ప్లాన్‌లను ఖచ్చితంగా అమలు చేస్తేనే విజయం సాధించగలం’ అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.