Fans sloganeering against CM Arvind Kejriwal Arrest in DC vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో కొందరు ఫాన్స్ రాజకీయ నినాదాలు చేశారు. స్టేడియంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ‘జైల్ కా జవాబ్ వోట్ సే’ (కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినందుకు ఓటు ద్వారా సమాధానం చెప్పండి) అని రాసి ఉన్న టీ షర్టులు ధరించి నినాదాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతుదారులు నినాదాలు చేశారు. బీజేపీ మద్దతుదారులు కూడా వారికి ధీటుగా బదులిచ్చారు. దాంతో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్ మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. 6 మంది అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంని అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ విద్యార్థి విభాగం ఛత్ర యువ సంఘర్ష్ సమితి నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం.
Also Read: Sanju Samson: రెండు బౌండరీలు ఇవ్వకుంటే బాగుండు: సంజూ శాంసన్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహాడ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మే 20 వరకు పొడిగించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలకు మే 25న పోలింగ్ జరగనుంది. ఈ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత కూడా అరెస్ట్ అయ్యారు.