ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. కళ్లు చెదిరే రీతిలో రూ.కోట్ల సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరుతోంది. డిజిటల్, టీవీ ప్రసార హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ వేలం నిర్వహించడం ద్వారా రూ.45వేల కోట్లు వస్తాయని తొలుత బీసీసీఐ అంచనా వేయగా ఎ, బి ప్యాకేజీలకు కలిపి బిడ్డింగ్ విలువ రూ.43,050 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా బిడ్డింగ్ కొనసాగనుంది. మరోవైపు సి, డి ప్యాకేజీల బిడ్డింగ్ ద్వారా రూ.5,500 కోట్లు వస్తాయని బీసీసీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో జరిగే ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ఇప్పటివరకు జరిగిన బిడ్డింగ్‌ను పరిశీలిస్తే ఒక్కో మ్యాచ్ విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు.
గత ఐదేళ్ల కాలంలో జరిగిన మ్యాచ్‌లకు సంబంధించి ఒక్కో మ్యాచ్ విలువ రూ.54.5 కోట్లు మాత్రమే. ఆ లెక్కన ఇప్పటి బిడ్డింగ్ డబుల్ అయిందనే చెప్పాలి. ఇది నమ్మశక్యంగా లేదని బీసీసీఐ అధికారులు చెప్తున్నారు. టీవీ, డిజిటల్ హక్కుల కోసం బిడ్డింగ్ రూ.50వేల కోట్లు దాటుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బిడ్డింగ్‌లో రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ స్టార్, సోనీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ప్యాకేజీ ఎ కోసం వేసిన బిడ్డింగ్‌కు జీ సంస్థ దూరంగా ఉండగా ప్యాకేజీ బిలోని డిజిటల్ ప్రసారాల హక్కుల కోసం జీ సంస్థ రేసులో ఉంది. దీంతో డిజిటల్ ప్రసారాల కోసం నాలుగు సంస్థల మధ్య పోటీ నెలకొంది. ప్యాకేజీ ఎలోని టీవీ ప్రసారాల బిడ్ రూ.23,370 కోట్లు, ప్యాకేజీ బిలోని డిజిటల్ ప్రసారాల బిడ్ రూ.19,680 కోట్లకు చేరింది.