ఈ ఏడాది ఐపీఎల్ మెగా టోర్నీ మార్చి 26న ప్రారంభం అవుతుందని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ అధికారికంగా వెల్లడించారు. ఈ సీజన్‌లో మొత్తం 10 జట్లు సందడి చేయనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో తొలిసారిగా బరిలోకి దిగబోతున్నాయి. 10 జట్లు కలిపి 74 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. వీటిలో 70 మ్యాచ్‌లు ముంబైలోని వాంఖడే స్టేడియం, బ్రబౌర్న్ స్డేడియం, నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియాల్లో చెరో 20 మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రబౌర్న్, గహుంజే స్టేడియాల్లో చెరో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి.
అయితే ఐపీఎల్ మ్యాచ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కరోనా ఆంక్షలకు లోబడి 40 శాతం మాత్రమే ప్రేక్షకులను అనుమతించనున్నారు. ప్లే ఆఫ్స్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే అవకాశముంది. మే 29న ఫైనల్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ భారత్‌లో ఐపీఎల్ నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలించకపోతే దక్షిణాఫ్రికాను ఆప్షన్‌గా పెట్టుకున్నామని బీసీసీఐ సెక్రటరీ జే షా వెల్లడించారు.