లార్డ్స్ వేదికగా గురువారం రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంంటే రెండో వన్డేలో విజయం సాధించి తీరాల్సిందే. టీమిండియా మాత్రం రెండో వన్డేలో కూడా రాణించాలని కోరుకుంటోంది. గజ్జల్లో గాయంతో తొలి వన్డేకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ రెండో వన్డేకు కూడా దూరం కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అతడు ఇంకా గాయం నుంచి కోలుకోలేదని తెలిపాయి. దీంతో తొలి వన్డేలో విఫలమైన శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశాన్ని మేనేజ్‌మెంట్ కల్పించనుంది. కోహ్లీ రాణించాలని కోరుకుంటున్న అతడి అభిమానులు మరో మ్యాచ్ వరకు ఆగాల్సిందే.
Read Also: ICC Rankings: టాప్-10లో భారత్ నుంచి ‘సూర్య’ ఒక్కడే..!!
తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబర్చిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడీ రెండో వన్డేలోనూ రాణించాలని టీమిండియా ఆకాంక్షిస్తోంది. ఇప్పటికే వన్డే క్రికెట్‌లో 5వేల పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్-శిఖర్ ధావన్ జోడీ నెలకొల్పారు. అటు ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు సిక్సులు కొట్టడంతో.. వన్డే చరిత్రలో 250 సిక్సర్లు పూర్తిచేసుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ తర్వాత ధోనీ(229), సచిన్(195), గంగూలీ(190), యువరాజ్(155), సెహ్వాగ్(136) ఉన్నారు. అంతర్జాతీయంగా చూస్తే పాకిస్థాన్ ఆటగాడు అఫ్రిదీ(351) టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత గేల్(331), జయసూర్య(270), రోహిత్ (250) ఉన్నారు.