India Vs Zimbabwe: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో కూడా టీమిండియానే టాస్ గెలిచింది. ఈ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి ఫీల్డింగ్ తీసుకునేందుకే మొగ్గు చూపించాడు. తొలివన్డేలో కూడా టీమిండియా టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా జింబాబ్వేను 189 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. అదే తరహాలో రెండో వన్డేలో కూడా తక్కువ పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేసేలా టీమిండియా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్ ఈ మ్యాచ్‌ను గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. లేదంటే మూడో వన్డే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం రిస్క్ తీసుకోవడానికి కేఎల్ రాహుల్ ఇష్టపడలేదు. ఇటీవల ఇంగ్లండ్, వెస్టిండీస్ గడ్డలపై వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా ఈ సిరీస్‌ను కూడా కైవసం చేసుకోగలిగితే విదేశీ గడ్డపై హ్యాట్రిక్ వన్డే సిరీస్ సాధించిన జట్టుగా నిలుస్తుంది.
కాగా ఈ వన్డేలో టీమిండియా ఓ మార్పుతో బరిలోకి దిగింది. ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. దీపక్ చాహర్ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను తీసుకోవడానికి గల కారణాలను కేఎల్ రాహుల్ వెల్లడించలేదు. అటు జింబాబ్వే మాత్రం తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. తడిమనషె మరుమని, రిచర్డ్ ఎంగర్వ స్థానంలో కైటనో, చివంగను తుదిజట్టులోకి తీసుకుంది. అటు గత మ్యాచ్‌లో తక్కువ లక్ష్యం కావడంతో శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేశారు. లక్ష్యం తక్కువగా ఉండటం వల్ల రాహుల్ ఓపెనింగ్ స్థానాన్ని మిస్సయ్యాడు. మరోవైపు టీమిండియా యువ ఆటగాళ్లు సంజూ శాంసన్, దీపక్ హుడాకు ఈ మ్యాచ్‌లోనైనా బ్యాటింగ్ చేసే అవకాశమొస్తుందా లేదా అనేది చూడాలి.
తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్, గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్
జింబాబ్వే: కైటనో, ఇన్నోసెంట్ కియా, సీన్ విలియమ్స్, వెస్లె మధెవెరె, సికందర్ రజా, రెజిస్ చకబ్వా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జొంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, టనక చివంగ