విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఓపెనర్లైతే భారత్‌కి శుభారంభాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57 పరుగులు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54 పరుగులు)లు ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు. మొదటి వికెట్‌కు వీళ్లు 97 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
తొలి 10 ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేయడంతో.. కచ్ఛితంగా 200 పరుగుల మైలురాయిని దాటేస్తుందని అంతా భావించారు. పడింది ఒక్క వికెట్టే, పైగా ఆ తర్వాత లైన్‌లో ఉన్న బ్యాట్స్మన్లందరూ విధ్వంసకరమైన బ్యాటర్లే! కాబట్టి, భారత ఆటగాళ్లు దంచికొడ్తారని అనుకున్నారు. కానీ, అందుకు భిన్నంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. ఒక్క హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 31 పరుగులు) మినహాయిస్తే, మిగిలిన బ్యాట్స్మన్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అటు.. ఐపీఎల్‌లో బెస్ట్ ఫినిషర్‌గా నిలిచిన దినేశ్ కార్తీక్ సైతం 6 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంటే, రెండో అర్ధభాగంలో భారత్ 10 ఓవర్లలో చేసింది 82 పరుగులే!
ఇక దక్షిణాఫ్రికా బౌలర్ల విషయానికొస్తే.. ప్రెటోరియస్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి, 2 వికెట్లు తీశాడు. రబాడా, షాంసీ, మహారాజ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. 180 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. ఇది డిఫెండ్ చేసుకోగలిగే లక్ష్యమే కాబట్టి, భారత బౌలర్లు సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ ఓడితే, సిరీస్ భారత్ చేజారినట్లే! మరి, టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదా? చూడాలి.