గత నవంబరులో సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ భంగపడిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై.. తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. స్పిన్ ఆడడంలో మేటి జట్టుగా పేరున్న టీమిండియా.. సొంతగడ్డపై అదే స్పిన్ ఉచ్చులో పడడం భారత క్రికెట్‌ను కుదిపేసింది. స్వదేశంలో మరోసారి ఇలాంటి పరాభవం చూడబోమని అటు మాజీలు, ఇటు ఫాన్స్ అనుకున్నారు. కానీ ఇప్పుడు టీమిండియాకు మరో వైట్‌వాష్ తప్పేలా లేదు. ఇప్పటికే కోల్‌కతా జరిగిన మొదటి టెస్టులో ఓడిన భారత్.. ప్రస్తుతం గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఓటమి అంచున నిలిచింది.
రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 రన్స్ చేయగా.. భారత్ 201 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ (58) హాఫ్ సెంచరీ చేయగా.. ప్రధాన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (48), కుల్దీప్ యాదవ్ (19) ఆడకుంటే భారత్ ఆ మాత్రం స్కోర్ కూడా చేయకపోయేది. తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యంను సఫారీలు సాధించారు. భారత్ తడబడిన అదే పిచ్‌పై దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగింది. 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు సునాయాసంగా పరుగులు చేశారు. ట్రిస్టన్ స్టబ్స్ (94) టోనీ డి జోర్జి (49), ర్యాన్ రికిల్‌టన్ (35), వియాన్ ముల్డర్ (35) రాణించారు.
549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్లకు 27 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6)లు ఔటయ్యారు. బ్యాటర్ సాయి సుదర్శన్ (2), నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్ (4) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఓటమి వైపు అడుగులేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ చూస్తే.. 8 వికెట్లతో చివరి రోజు నిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం అంటే అంత ఆషామాషీ కాదు. డ్రా కావాలంటే ఏదైనా అద్భుతమే జరగాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.