వరుసగా 13 మ్యాచులు గెలిచి, ప్రపంచ రికార్డు విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశ నెరవేరలేదు. తొలి T20 ముందు వరకు కూడా 12 విజయాలతో పొట్టి ఫార్మాట్ లో అత్యధిక వరుస విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్, రొమేనియాలతో కలిసి సమానంగా ఉన్న భారత్ జట్టుకు దక్షిణాఫ్రికా రూపంలో కళ్లెం పడింది. దాంతో వరుస విజయాల రికార్డును తన పేరిట లిఖించుకోలేకపోయింది. ఇక రేపు జరిగే రెండో T20 కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. ఒడిశా వేదికగా కటక్ లోని బారాబతి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇక రిషభ్ పంత్ కు కెప్టెన్ గా నిరూపించుకోవాలంటే.. ఈ మ్యాచ్ ఎంతో కీలకం. అయితే పంత్ తొలి మ్యాచ్ లో కెప్టెన్ గా బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. దాంతో అతడిపై విమర్శలు ఎక్కువయ్యాయి.
తొలి T20 మ్యాచ్ లో భారత బౌలింగ్ తేలిపోయింది. 212 లాంటి భారీ టార్గెట్ ను సైతం కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, యుజువేంద్ర చహల్ తేలిపోయారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడంలో భారత్ పూర్తిగా విఫలమైంది. ఆరంభంలో బాగా బౌలింగ్ చేసిన అవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ లు చివర్లో దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక యుజువేంద్ర చహల్ ను ఉపయోగించుకోవడంలో పంత్ దారుణంగా లెక్క తప్పాడు. ఈ క్రమంలో అవేశ్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ ను తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే IPLలో అర్ష్ దీప్ సింగ్ డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణించాడు. దాంతో ఉమ్రాన్ మాలిక్ మరోసారి బెంచ్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ లో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు.
ఎక్స్ ట్రా బౌలర్ తో ఆడాలనుకుంటే మాత్రం దినేశ్ కార్తీక్ ను బెంచ్ కే పరిమితం చేసే అవకాశం ఉంది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రుతురాజ్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్, పంత్ మిడిల్ ఓవర్లలో అద్బుతంగా ఆడారు. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా మునుపటిలా రెచ్చిపోయాడు. దాంతో భారత బ్యాటింగ్ భీకరంగా కనిపిస్తోంది. ఎటొచ్చి బౌలింగ్, ఫీల్డింగ్ లలోనే టీమిండయా కాస్తా మెరుగవ్వాల్సిన పరిస్థితి. సౌతాఫ్రికా కూడా సూపర్ ఫామ్ లో ఉంది. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, డుస్సెన్ రూపంలో మ్యాచ్ విన్నర్లు ఆ జట్టు సొంతం. ఇక గత మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్ లో ముందు వచ్చిన ప్రిటోరియస్ తాను మెరుపులు మెరిపించగలనని స్పష్టం చేశాడు. దాంతో కటక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు పండగే అని చెప్పాలి.
కటక్ వేదికగా ఇప్పటి వరకు భారత్ రెండు T20 మ్యాచ్ లు ఆడింది. మొదటి మ్యాచ్ లో శ్రీలంకపై నెగ్గిన టీమిండియా.. తరువాత సౌతాఫ్రికా చేతిలో దారుణంగా ఓడింది.
టీమిండియా తుది జట్టు (అంచనా):
రిషభ్ పంత్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్/అర్ష్ దీప్ సింగ్, యుజువేంద్ర చహల్