టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్‌కు మెడ గాయం అయిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గిల్ గాయపడ్డాడు. గాయం కారణంగా గిల్ రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేదు. నవంబర్ 22 నుంచి గువాహటిలో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టులో గిల్ ఆడటం లేదన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నం.4పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఒకవేళ గిల్ ఆడకుంటే.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు అవకాశం కల్పించాలని పేర్కొన్నాడు.
Also Read: Hidma Diary: సంచలనంగా మరిన హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టుల అరెస్ట్.. 4 రాష్ట్రాల్లో సోదాలు..
ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ… ‘శుభ్‌మాన్ గిల్‌కు గాయం అయింది. రెండో టెస్ట్‌లో ఆడతాడా? లేదా? అన్నది ఇంకా తెలియదు. ఒకవేళ గిల్ దూరమైతే.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌నే ఆడించాలి. ఇప్పటికే భారత జట్టును ప్రకటించారు. మరి గైక్వాడ్‌ను ఎలా తీసుకుంటారని సందేహం వస్తుంది. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్‌లు రిజర్వ్ ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరూ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. సాయి, పడిక్కల్‌లలో ఎవరిని తీసుకున్నా.. తుది జట్టులో ఏడుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు అవుతారు. ఇది సబబు కాదు. రుతురాజ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత్ ఏ తరఫున వన్డేల్లో రాణిస్తున్నాడు. గైక్వాడ్ భారత్ ఏ తరఫున రెడ్‌బాల్ క్రికెట్‌లో అవకాశాలు రావడం లేదు. రంజీ, దులీప్ ట్రోఫీల్లో అతడు రాణించాడు. గిల్ స్థానాన్ని గైక్వాడ్‌తో భర్తీ చేయొచ్చు’ అని అన్నారు.