Hidma Diary: మావోయిస్టు కీలక నేత హిడ్మా డైరీ ఇప్పుడు భద్రతాబలగాలు, పోలీసులకు కీలక సమాచారాన్ని ఇచ్చింది.. దీంతో, రంగంలోకి దిగిన ఆక్టోపస్, పోలీసులు.. విజయవాడలో మకాం వేసిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు.. ఈ రోజు మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందగా.. హిడ్మా డైరీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. డైరీలో ఉన్న వివరాల ఆధారంగా పెనమలూరులో 27 మంది ఉంటున్నట్లు గుర్తించారు అక్టోబస్ పోలీసులు.. ఇక, డైరీలో ఉన్న సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాల్లో పరిధిలోని అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు..
Read Also: Prashant Kishor: రాజీనామా చేస్తానన్న ప్రకటనపై ప్రశాంత్ కిషోర్ రియాక్షన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలికలపై స్పెషల్ ఏజెన్సీలు దృష్టి సారించగా.. భారీ ఆపరేషన్‌లో మరో కీలక విజయాన్ని సాధించారు. విజయవాడలోని కానూరు.. ఆటోనగర్ ప్రాంతంలో మొత్తం 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.. అరెస్టైన వారిలో 21 మంది మహిళలు ఉండటం సంచలనంగా మారింది. పోలీసుల ప్రాథమిక విచారణలో.. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని, ఈ రోజు ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా అనుచరులని గుర్తించారు. అరెస్టయిన వారిలో నలుగురు కీలక మావోయిస్టు కమాండర్లు కూడా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
స్థానిక పోలీసుల సహకారంతో ఆక్టోపస్ బలగాలు ప్లాన్ చేసిన ఈ ఆపరేషన్ నిర్వహించారు.. సుమారు 20 రోజుల క్రితం రోజువారీ కూలీలుగా చెప్పుకుంటూ ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకున్నారు మావోయిస్టులు.. ఆ బిల్డింగ్ యజమాని పెనమలూరు ప్రాంతానికి చెందిన అప్పలస్వామి కాగా, ఆయనే ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతి చెందిన తర్వాత, అక్కడినుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో ఉన్న వివరాలే ఈ ఆపరేషన్‌కు కీలక ఆధారంగా మారాయి..
హిడ్మా డైరీలో కీలక సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మావోయిస్టుల నివాసాల వివరాలు.. సంప్రదింపులకు సంబంధించిన కోడ్‌లు.. డంప్‌ల (హథియార్ స్టోరేజ్ పాయింట్లు) లొకేషన్లు వంటి సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సమాచారంతోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్.. నాలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.. మావోయిస్టులు ఏపీలో వివిధ ప్రదేశాల్లో ఎనిమిది డంప్‌లు ఏర్పాటు చేసినట్లు సమాచారం రావడంతో.. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకోవడం కోసం రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు..