T20 World Cup: T20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ నకరాలకు చేస్తోంది. భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చెబుతోంది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. తమను ఐర్లాండ్‌తో స్వాప్ చేయాలని కోరింది. అయితే, షెడ్యూల్‌ను మార్చేది లేదని తమకు హామీ వచ్చిందిన ఐర్లాండ్ స్పష్టం చేసింది. ఐర్లాండ్ తన లీగ్ మ్యాచుల్ని శ్రీలంకలో ఆడుతోంది. ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ అభ్యర్థను ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. బోర్డు ఓటింగ్‌లో ఈ ప్రతిపాదనకు 14-2 ఓట్ల తేడాతో వీగిపోయినట్లు సమచారం. భారత్‌లో ఆడటానికి బంగ్లాదేశ్ నిరాకరిస్తే ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించి, దాని స్థానంలో మరో జట్టును తీసుకుంటామని ఐసీసీ బంగ్లా క్రికెట్ బోర్డును హెచ్చరించింది.
ఓటింగ్ తర్వాత, ఈ ఫలితాలనున బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా తెలియజేయాలని ఐసీసీ బంగ్లా బోర్డును కోరింది. బంగ్లాదేశ్ భారత్‌లో ఆడటానికి నిరాకరిస్తే, దాని స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంటామని ఐసీసీ స్పష్టం చేసింది. తుది నిర్ణయాన్ని తెలియజేయడానికి బంగ్లాదేశ్‌కు మరో రోజు గడువు ఇచ్చింది. బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ తన వైఖరికి కట్టుబడి ఉంటే, దాని స్థానంలో మరో జట్టును తీసుకురావడానికి మెజారిటీ డైరెక్టర్లు అనుకూలంగా ఓటు వేశారు. హాజరైన 15 మంది డైరెక్టర్లలో, కేవలం పీసీబీ మాత్రమే బీసీబీకి మద్దతు ఇచ్చిందని తెలిసింది. టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్యమిస్తున్న శ్రీలంకలో ఆడాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనకు తాము మద్దతు ఇస్తున్నామని పేర్కొంటూ పీసీబీ మంగళవారం ఐసీసీకి, ఇతర బోర్డులకు లేఖ రాసిన తర్వాత ఈ సమావేశం జరిగింది.
టీ20 ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ కోల్‌కతాలో మూడు లీగ్ మ్యాచ్‌లు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాలను చూపుతూ, తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. ప్రస్తుతం, బంగ్లాదేశ్ వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్‌లతో పాటు గ్రూప్ సిలో ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ వైదొలిగితే, స్కాట్లాండ్ గ్రూప్ సిలో వారి స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని వారాలుగా ఈ ప్రతిష్టంభన నెలకొంది. షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఐసీసీ చెబుతుంటే, తాము భారత్‌లో ఆడబోమని బంగ్లా స్పష్టం చేస్తో్ంది.
ఐపీఎల్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) నుంచి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ను తీసేసిన తర్వాత వివాదం మొదలైంది. బంగ్లాలో హిందువుల హత్యలను భారత ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్‌లోకి ముస్తాఫిజుర్‌ను తీసుకోవడంపై వివాదం మొదలైంది.