టీమిండియా జట్టుకు గాయాలు, వైఫల్యాలతో కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాలో చోటు కోల్పోయి తిరిగి బలంగా వచ్చాడు ఈ ఆల్‌రౌండర్. అయితే అందుకోసం ఎన్నో త్యాగాలు చేసినట్లు చెప్పొకొచ్చాడు పాండ్యా. జట్టుకు దూరమైనప్పుడు తాను చేసిన కృషి.. తనకు ఇటీవలి విజయాల కంటే ఎక్కువ ఆనందాన్నిచ్చినట్టు చెప్పాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా వచ్చిన అవకాశాన్ని పాండ్యా పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం తెలిసిందే. ఆల్ రౌండర్‌గా తాను రాణించడమే కాకుండా, జట్టు మొత్తాన్ని సమష్టిగా నడిపించి, టైటిల్ సాధించాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లోనూ మెరుస్తున్నాడు. తొలి టీ20లో అతడు మెరుపు బ్యాటింగ్ చేసి జట్టు 200పై చిలుకు స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓ ఇంటర్వ్యూలో.. తాను ఇలా బలంగా తిరిగి రావడానికి ఎంతో కష్టపడ్డానని చెప్పాడు.
దీంతో హార్థిక పాండ్యాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అతడు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. ఇక తన పనితీరు సరిగా లేనప్పుడు తన గురించి ఎంతో మంది ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని.. ఆ విమర్శలను తాను పట్టించుకోలేదని పాండ్యా అన్నాడు. కష్టపడి పనిచేయడంపై దృష్టి సారించడం వల్లే మళ్లీ బలంగా తిరిగి రాగలిగినట్టు వివరించాడు. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత పాండ్యా తిరిగి భారత జట్టుకు ఆడలేదు.
‘‘ఆరు నెలల పాటు నేను ఎంత కష్టపడ్డానన్నది ఎవరికీ తెలియదు. ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఎంతో సాధన చేశాను. నాలుగు నెలల పాటు రోజూ రాత్రి 9.30 గంటలకు నిద్రించాను. ఎన్నో త్యాగాలు చేశాను. ఐపీఎల్ ఆడడానికి ముందు అది నాకు ఓ పోరాటమే. ఫలితాల పట్ల సంతృప్తిగా ఉంది. నేను ఎంత కష్టపడ్డానన్నది నాకు తెలుసు. నా జీవితంలో కష్టపడి పనిచేయడమే కానీ ఫలితాల గురించి ఆందోళన చెందను. అందుకే ఎప్పుడైనా నేను అసాధారణ ప్రదర్శన చేసినప్పుడు పొంగిపోను’’ అని పాండ్యా తన మనోగతాన్ని వివరించాడు.