During Virat Kohli Innings UPI Transactions Took A Hit: సాధారణంగా యూపీఐ లావాదేవీలు ఎంతో జోరుగా జరుగుతుంటాయి. ఇక పండగ సమయాల్లో మరింత పుంజుకుంటాయి. సాధారణ రోజులతో పోలిస్తే.. రెండింతలు లేదా అంతకంటే ఎక్కువగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ కొనసాగుతాయి. కానీ.. నిన్న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో మాత్రం ఆ ట్రాన్సాక్షన్స్ చాలా దారుణంగా పడిపోయాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ట్రాన్సాక్షన్స్ జోరుగానే సాగాయి. కానీ, సరిగ్గా మ్యాచ్ ప్రారంభమయ్యాక యూపీఐ లావాదేవీలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.
తొలుత.. టాస్ దగ్గర్నుంచి పాకిస్తాన్ బ్యాటింగ్ మొదలయ్యేవరకూ, యూపీఐ ట్రాన్సాక్షన్స్ 6 శాతం పడిపోయాయి. పాకిస్తాన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ పూర్తయ్యాక.. యూపీఐ లావాదేవీలు కాస్త పుంజుకున్నాయి. కానీ.. మళ్లీ టీమిండియా బ్యాటింగ్ మొదలవ్వగానే యూపీఐ లావాదేవీల సంఖ్య డ్రాప్ అయ్యింది. ఇక చివర్లో.. విరాట్ కోహ్లీ తన సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌ని గెలిపించే దిశగా తీసుకెళ్తున్నప్పుడు, యూపీఐ లావాదేవీలు మరింతగా పడిపోయినట్లు తేలింది. ఉదయం 9 గంటలతో పోలిస్తే.. సాయంత్రం 4.45 నుంచి 5.30 గంటల వరకు 20 శాతం లావాదేవీలు ఢమాల్ అయినట్టు మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా ట్విటర్ మాధ్యమంగా వెల్లడించారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. విరాట్ కోహ్లీ వల్లే దేశవ్యాప్తంగా షాపింగ్ ఆగిపోయిందనే క్యాప్షన్ కూడా పెట్టారు.
సాధారణంగానే.. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అన్నప్పుడు భారతీయ క్రీడాభిమానులు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతారు. అలాంటిది.. నిన్న నరాలు తెగే త్రిల్లింగ్ మ్యాచ్ కొనసాగడం, కోహ్లీ విజృంభించడంతో, మ్యాచ్ చూసేందుకు జనాలు మరింత ఎగబడ్డారు. డిస్నీ+ హాట్‌స్టార్ చరిత్రలో ఎన్నడూ లేనంత 1.80 కోట్ల మంది వీక్షించారంటే, పరిస్థితి మీరే అర్థం చేసుకోండి. అందుకే, యూపీఐ లావాదేవీలు గణనీయంగా పడిపోయాయి.