Deepak Hooda Created A New Record In New Zealand Match: ఆదివారం న్యూజీలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే! ఈ విజయంలో సూర్యకుమార్ యాదవ్ చేసిన శతకం ఎంతో కీలకంగా నిలిచిందో.. భారత బౌలర్లూ అంతే ప్రత్యేకత చాటారు. ప్రత్యర్థి బ్యాటర్లను పెద్దగా స్కోర్ కొట్టనివ్వకుండా, కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి, తమ సత్తా చాటారు. వరుసగా వికెట్లు పడగొట్టారు. దీపక్ హుడా అయితే ఏకంగా నాలుగు వికెట్లు తీసి.. అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే అతను తన ఖాతాలో అరుదైన రికార్డ్ వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు వేసిన హుడా.. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి, 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో.. తద్వారా న్యూజిలాండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు.
ఇంతకుముందు ఈ ఘనత అక్షర్ పటేల్ పేరు మీద ఉండేది. 2021లో కోల్‌కతాలో న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 3 ఓవర్లు వేసి, కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఒక వికెట్ ఎక్కువ తీసి, ఆ రికార్డ్‌ని దీపక్ బద్దలుకొట్టాడు. అంతేకాదు.. అతని కెరీర్‌లో ఒక టీ20 మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడం కూడా ఇదే మొదటిసారి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సూర్యకుమార్ (51 బంతుల్లో 111) శతకంతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు.. భారత బౌలర్ల ధాటికి కుదేలయ్యింది. ఒక్క కేన్ విలియమ్సన్ మాత్రమే పోరాడగా, మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 126 పరుగులకే న్యూజీలాండ్ ఆలౌట్ అయ్యింది. తద్వారా.. మూడు మ్యాచ్‌లో టీ20 సిరీస్‌లో 1-0తో భారత్ పైచేయి సాధించింది.