Danish Kaneria Fires On Indian Selectors For Not Selecting Sanju Samson: కేరళకు చెందిన టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ ఒక మంచి ఆటగాడు. తనకొచ్చిన అవకాశాల్లో కొన్నింటిని సద్వినియోగపరచుకోలేదు కానీ, మిగిలిన సమయాల్లో మాత్రం అదరగొట్టేశాడు. ఇక ఐపీఎల్‌లో అతను సాధించిన ఘనతలు అన్నీ ఇన్నీ కావు. ఒంటి చేత్తోనే జట్టుని నడిపించిన సందర్భాలున్నాయి. అందుకే, ఇతనికి టీమిండియాలో చోటు కల్పించాల్సిందిగా అభిమానులు కోరుతూ వస్తున్నారు. ముఖ్యంగా.. టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టులో అతనికి చోటు దక్కొచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ, ఈసారి కూడా భారత సెలెక్టర్లు మొండిచెయ్యే చూపించారు. దీంతో.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాలెంట్‌తో పాటు మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ.. ఎందుకు సంజుని ఎంపిక చేయలేదని మండిపడుతున్నారు. మాజీలు సైతం అతడ్ని సెలెక్ట్ చేయకపోవడంపై ఫైర్ అవుతున్నారు.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సైతం.. సంజు శాంసన్‌కు అన్యాయం జరిగిందంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో భాగంగా అతనికి భారత జట్టులో చోటు లభించలేదని, టీ20 ప్రపంచకప్ జట్టులో తీసుకుని ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. జట్టులో చోటు దక్కకపోవడానికి అతడు చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. చివరికి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన హోం సిరీస్‌లలోనూ అతడిని పక్కన పెట్టేశారని విమర్శించాడు. ప్రపంచకప్‌కు ప్రకటించిన జట్టులో పంత్‌కు బదులుగా సంజూను తీసుకుంటే బాగుండేదని, తన మద్దతు సంజుకేనని కనేరియా చెప్పాడు. అలాగే, స్టాండ్‌బై ఆటగాడిగా ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకుని ఉండాల్సిందన్నాడు. ఇక విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడని చెప్పిన కనేరియా.. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి వారు కూడా భారీ స్కోర్లు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. లేకపోతే.. ఆసియా కప్‌లాగే టీ20 ప్రపంచకప్‌లోనూ భారత ప్రస్థానం ముగుస్తుందని హెచ్చరించాడు.
ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్
స్టాండ్‌బై ఆటగాళ్లు: మహ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్