భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ 2026కు తమ జట్టును పంపడంపై భద్రతా పరమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి జట్టును పంపడం తమకు సురక్షితంగా అనిపించడం లేదని సోమవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఇదే విషయాన్ని బీసీబీ అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి లేఖ ద్వారా తెలియజేసినట్టు వెల్లడించారు. ఐపీఎల్ 2026లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఆడకూడని బీసీసీఐ ఆదేశాలు జారీ చేయడమే ఈ పరిణామాలకు కారణం. ఈ నేపథ్యంలోనే బీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది.
‘ఈ నిర్ణయం తీసుకునే ముందు బిసీబీ బోర్డు డైరెక్టర్లతో కలిసి రెండుసార్లు సమావేశం అయ్యాం. ప్రస్తుత పరిస్థితుల్లో 2026 టీ20 వరల్డ్‌కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ జట్టును భారత్‌కు పంపడం సురక్షితం కాదని భావించాం. అందుకే ఐసీసీకి లేఖ రాశాం. భద్రతే మాకు ప్రధాన సమస్య. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే ఐసీసీతో మీటింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ సమావేశంలో మా సమస్యలను పూర్తిగా వివరిస్తాం. ఇది ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీ. కాబట్టి మేము బీసీసీఐతో కాకుండా ఐసీసీతోనే సంప్రదింపులు జరుపుతున్నాం’ అని బిసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు 2026 టీ20 వరల్డ్‌కప్‌లోభాగంగా భారత్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, ఒక మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. గ్రూప్ ‘సి’లో ఉన్న బంగ్లాదేశ్ ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఇటలీ, నేపాల్ జట్లతో పోటీ పడాల్సి ఉంది. ఐసీసీ ఒప్పుకుంటే బంగ్లాదేశ్ తమ మ్యాచ్‌లను భారత్‌లో కాకుండా శ్రీలంకలో ఆడే అవకాశాలు ఉన్నాయి. దాయాది పాకిస్థాన్ మ్యాచ్‌లు లంకలో జరుగుతున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఐసీసీ ఏ నిర్ణయం తీసిఉంటుందో.
Also Read: Mohammed Shami: చిక్కుల్లో మొహమ్మద్ షమీ.. విచారణకు హజరుకావాలంటూ నోటీసులు!
ఇటీవల భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఆమె గత ఆగస్టులో భారత్‌కు రావడంతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో పలువురు విద్యార్థులు మృతి చెందారు. హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక దాడులు పెరిగాయి. ఈ రాజకీయ, సామాజిక పరిణామాల నేపథ్యంలోనే టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు భారత్‌కు రావడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా ఆందోళనలు వ్యక్తం చేయడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.