BCCI: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలతో త్వరలో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరితో భవిష్యత్ టీ20 జట్టుపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే టీ20లకు హార్దిక్ పాండ్యాను సారథిగా చేయడంతో పాటు టాలెంట్ ఉన్న కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే క్లారిటీ రానుంది. రోహిత్ శర్మ వయసు 35 ఏళ్లు చేరుకోగా.. విరాట్ కోహ్లీ 34 ఏళ్లకు చేరుకున్నాడు. భారత్ క్రికెట్ మూలస్థంబాలు అయిన ఈ ఇద్దరి కెరీర్ చరమాంక దశలో ఉన్నారు. మూడు ఫార్మాట్లలో ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలకం. అప్‌కమింగ్ మెగా టోర్నీల నేపథ్యంలో బీసీసీఐ పెద్దలు రోహిత్, కోహ్లీతో మాట్లాడే అవకాశం ఉందని బోర్డు అధికారి మీడియాకు తెలిపాడు.
Read Also: High Court: గ్రామ సభలు నిర్వహించి సవరణలు చేయండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఇప్పటికే న్యూజిలాండ్ సిరీస్ కోసం కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను పక్కనబెట్టిన బీసీసీఐ వీవీఎస్ లక్ష్మణ్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. అటు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన టీమిండియా ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ వెళ్లనుంది. ఈ పర్యటనలో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడుతుంది. న్యూజిల్యాండ్‌తో టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడు. వన్డే సిరీస్‌లో శిఖర్ ధావన్ జట్టు పగ్గాలు అందుకుంటాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడుతుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు స్వదేశానికి చేరుకుంటుంది. స్వదేశంలో వరుసగా శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీస్‌లు ఆడనుంది. స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత జట్టు ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో కూడా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అనంతరం ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది. టీమిండియా బిజీ షెడ్యూల్ ఏడాది చివరి వరకు కొనసాగుతుంది.