భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొన్ని సంవత్సరాల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుతో మ్యాచ్‌లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ టోర్నీల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన తర్వాత చాలా మంది ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌ను పక్కన పెట్టేస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే బీసీసీఐ ఆ విధానంను తీసుకొచ్చింది. ఈ మార్పు దేశవాళీ క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది. యువ ఆటగాళ్లకు స్టార్ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం లభించడమే కాకుండా.. అభిమానుల్లో కూడా దేశవాళీ మ్యాచ్‌లపై ఆసక్తి పెరిగింది.
గత ఏడాది రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ పాల్గొన్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌ను చూడటానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జైపూర్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో ముంబై జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్‌కు భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఇందుకు కారణం రోహిత్ శర్మ ముంబై ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటమే. అంతేకాదు బెంగళూరులో ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్‌లు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. అయితే ఆ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులకు బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. రోహిత్ -కోహ్లీ పాల్గొన్న మ్యాచ్‌ల లైవ్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
స్టేడియానికి వెళ్లలేని అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లు ఆడుతున్న మ్యాచ్‌లను లైవ్‌గా ప్రసారం చేయడం లేదని, టీవీ లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూసే అవకాశం లేకుండా పోయిందని బీసీసీపై విమర్శలు వచ్చాయి. బెంగళూరులో జరిగిన ఢిల్లీ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండా ‘క్లోజ్డ్ డోర్స్’లో జరగడం మరింత ఆగ్రహానికి కారణమైంది. స్టార్ ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న క్రికెట్ ప్రేమికులకు ఇది తీవ్ర నిరాశగా మారింది. ఈ పరిణామాలన్నింటినీ బీసీసీఐ పరిగణలోకి తీసుకుంది. దేశవాళీ టోర్నీల ప్రసార విధానంలో కీలక మార్పులు తీసుకురావాలని బోర్డు ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.
Also Read: Vivo V50 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో 11 వేల భారీ తగ్గింపు.. చౌకగా వివో వీ50, లిమిటెడ్ స్టాక్!
‘అంతర్జాతీయ క్రికెటర్లు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇది పెద్ద మార్పు. గతంలో దేశవాళీ మ్యాచ్ ఎందుకు లైవ్ చూపించడం లేదు?, ఏ మ్యాచ్‌లు టెలికాస్ట్ అవుతాయి? అని ఎవరూ అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు మీడియా నుంచే కాదు సాధారణ ప్రజల నుంచి కూడా ప్రశ్నకు వస్తున్నాయి. మ్యాచ్‌లు ఎక్కడ టెలికాస్ట్ అవుతున్నాయి?, మ్యాచ్‌లు ఎందుకు లైవ్ ఇవ్వడం లేదు అడుగుతున్నారు. ప్రస్తుతం 100 దేశవాళీ మ్యాచ్‌లను లైవ్ ప్రసారం చేస్తున్నాం. త్వరలోనే ఆ సంఖ్యను పెంచుతాం. ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాం’ అని సైకియా స్పోర్ట్‌స్టార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. స్టార్ ఆటగాళ్ల రాకతో దేశవాళీ క్రికెట్‌కు వచ్చిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని.. రానున్న రోజుల్లో ఎక్కువ మ్యాచ్‌లను లైవ్ టెలికాస్ట్ చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తోంది.