IND Vs BAN: ఛటోగ్రామ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ కుప్పకూలింది. 133/8 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఉదయం సెషన్‌లో ఆట ప్రారంభమైన కాసేపటికే బంగ్లాదేశ్ 150 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ కుల్దీప్ 5 వికెట్లతో విజృంభించాడు. 28 పరుగులు చేసిన ముష్పీకర్ రహీమ్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. మెహిదీ హసన్ మిరాజ్ 25 పరుగులు, లిట్టన్ దాస్ 24 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో కుల్దీప్ 5 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు సాధించారు. అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్ తలో వికెట్ తీశారు.
Read Also: Anakapalle: ప్రేమ పేరుతో వేధింపులు.. కోడికత్తితో యువతిపై యువకుడు దాడి
కాగా బంగ్లాదేశ్ ఫాలో ఆన్‌లో పడినా టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇవ్వలేదు. దీంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 254 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించడంతో ఈ టెస్టులో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ రాణించాల్సి ఉంది. అటు రెండో రోజు ఆటలో నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్.. బంగ్లా మిడిలార్డర్‌ను తుత్తునియలు చేశాడు. అయితే తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ దక్కడం అదృష్టమని కుల్దీప్ యాదవ్ అన్నాడు. దీంతో తన ఫీలింగ్ మారిందన్నాడు. ఆ తర్వాత పిచ్ వేరియేషన్స్‌కు సహకరిస్తోందని అర్థమైందని, దాన్ని ఉపయోగించుకున్నట్లు చెప్పాడు.