Aaron Finch: ఆస్ట్రేలియా జట్టు వన్డే కెప్టెన్ అరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ తనకు చివరిది అని అరోన్ ఫించ్ పేర్కొన్నాడు. దీంతో ఆదివారం న్యూజిలాండ్‌తో జరగనున్న మూడో వన్డే ఫించ్ వన్డే కెరీర్‌లో చివరిది కానుంది. అరోన్ ఫించ్ ఇప్పటివరకు 145 వన్డేలు ఆడి 5,041 పరుగులు చేశాడు. వీటిలో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 54 వన్డేల్లో ఆసీస్ జట్టు కెప్టెన్‌గా ఫించ్ వ్యవహారించాడు.
Read Also: Viduthalai: కొడైకెనాల్ లో ఎవరూ గుర్తుపట్టని స్థితిలో విజయ్ సేతుపతి!?
అరోన్ ఫించ్ 2013లో శ్రీలంకపై ఆసీస్ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. టీ20లపై మరింత ఫోకస్ పెట్టేందుకే తాను వన్డే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు అరోన్ ఫించ్ వివరించాడు. ఆస్ట్రేలియా వంటి అద్భుత జట్టులో భాగమైనందుకు తాను అదృష్టవంతుడిని అని పేర్కొన్నాడు. తన ప్రయాణంలో మద్దతుగా నిలిచిన క్రికెట్ ఆస్ట్రేలియా, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఫించ్ తెలిపాడు. అయితే కొంతకాలంగా ఫించ్ వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నాడు. కాగా చివరి ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి.