FIFA World Cup: ఖతార్ వేదికగా ఇటీవల జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా విజేతగా నిలిచింది. దీంతో ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ కల కూడా నెరవేరింది. అర్జెంటీనా విజయం సాధించడంతో ప్రపంచంలోని పలు దేశాల్లో ఫుట్‌బాల్ అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఇందులో మన ఇండియాలోని కేరళ కూడా ఉంది. కేరళలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా హోటల్ నిర్వహిస్తున్న శింబు అనే వ్యక్తి ఈ ఏడాది ప్రపంచకప్‌లో అర్జెంటీనా కప్పు కొడితే వెయ్యి మందికి ఉచితంగా బిర్యానీ పంచిపెడతానని అందరికీ మాటిచ్చాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బ్యానర్ కట్టించాడు.
Read Also: Manmadhudu: ఇరవై ఏళ్ళ ‘మన్మథుడు’
అయితే తాను మాట ఇచ్చిన ప్రకారం ఫైనల్‌లో ఫ్రాన్స్‌ను అర్జెంటీనా ఓడించడంతో శింబు టేస్టీ బిర్యానీ పంచిపెట్టేందుకు రెడీ అయ్యాడు. దీంతో అతడి హోటల్ ముందు కిలోమీటర్ల మేర స్థానికులు బారులు తీరారు. ఇంత మంది రావడంతో మరో 500 బిర్యానీలను అదనంగా పంచిపెట్టినట్లు శింబు చెప్పాడు. తాము 36 ఏళ్లుగా అర్జెంటీనా విజయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. ఇది మెస్సీ వయసు కన్నా ఎక్కువ అని, అంటే అతడు పుట్టకముందు నుంచి తాము ఎదురు చూస్తున్న క్షణం ఇప్పుడొచ్చిందని వివరించాడు. కాగా శింబు హోటల్ దగ్గరకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కూడా అభిమానుల సంబరాల్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.