Nagarjuna Manmadhudu Completes 20 Years: “స్వీయలోపంబెరుగుట పెద్ద విద్య…” అనే మీర్జా గాలిబ్ మాటలను తు.చ. తప్పక పాటించిన వారు ఏ రంగంలోనైనా రాణిస్తారు అని మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తరచూ చెప్పేవారు. ఆయన నటవారసుడు నాగార్జున సైతం తండ్రి మాటను తు.చ. తప్పక పాటిస్తూ చిత్రసీమలో సాగారు. ఆరంభంలో విమర్శకులు నాగ్ పై సంధించిన అస్త్రాలకు సమాధానంగా తన శరీరసౌష్టవాన్ని చూపరులను ఆకట్టుకొనేలా తీర్చిదిద్దుకున్నారు. తరువాత వైవిధ్యమైన పాత్రలతో అలరించారు. చివరకు ప్రేక్షకులతో ‘మన్మథుడు’ అనిపించుకొనేలా చేసుకున్నారు. అలా నాగార్జునను జనం ముందు ‘మన్మథుడు’గా నిలిపింది దర్శకుడు కె.విజయభాస్కర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి. సదరు ‘మన్మథుడు’ 2002 డిసెంబర్ 20న విడుదలయింది.
ఇంతకూ ఈ మన్మథుడు కథ ఏమిటంటే – ఆడాళ్ళంటే పడని అభిరామ్ తమ కుటుంబానికి చెందిన యాడ్ ఏజెన్సీలో మేనేజర్ గా ఉంటాడు. అతని బాబాయ్ దానికి ఎమ్.డి. తమ కంపెనీ సక్సెస్ రూటులో సాగడానికి అభి బాబాయ్ ప్రసాద్, హారిక అనే క్రియేటివ్ హెడ్ ను తీసుకు వస్తాడు. వచ్చిన దగ్గర నుంచీ ఆ అమ్మాయి అంటే అభికి పడదు. ఆ అమ్మాయి కాన్సెప్ట్స్ నే చాటుగా విని తనవిగా ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు అభి. ఓ సారి వీరిద్దరూ కలసి కంపెనీ పనిమీద ప్యారిస్ వెళ్ళవలసి వస్తుంది. అక్కడ వారిద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. పైగా అతను స్త్రీద్వేషిగా ఎందుకు మారాడో తెలుసుకుంటుంది. ఒకప్పుడు తమ కంపెనీలో పనిచేసే గుమస్తా అన్న కూతురును అభి ప్రేమించి ఉంటాడు. యాక్సిడెంట్ లో ఆమె చనిపోతుంది. ఆమె మరణించిందని తెలిస్తే, అభి ఎక్కడ తమకు దక్కకుండా పోతాడో అని ఆయన తాతయ్య, ఆ అమ్మాయికి మరో వ్యక్తితో వివాహం అయిందనే అబద్ధం చెప్పి ఉంటాడు. దాంతో మహిళలు అంటేనే అభికి గౌరవం లేకుండా పోతుంది. చివరకు హారికతో ప్రేమలో పడ్డానని తెలుసుకుంటాడు అభి. కానీ, అది చెప్పేలోగా ఆమెకు వేరొకరితో వివాహం నిశ్చయమైందని తెలుస్తుంది. దూరంగా ఉంటాడు. హారికకు కూడా అతనంటే ప్రేమ. ఆ విషయం చెప్పే ప్రయత్నం చేస్తుంది కానీ, అభి పట్టించుకోడు. చివరకు హారిక పెళ్ళి కోసం పెళ్ళికొడుకు ఊరికి కుటుంబసభ్యులతో బయలు దేరుతుంది. అదే సమయంలో అభికి తన మాజీ ప్రియురాలు చనిపోయిందన్న విషయం తెలుస్తుంది. అతనిలో పశ్చాత్తాపం పెరుగుతుంది. జీవితంలో అందివచ్చిన హారికను చేజార్చుకోరాదని పరుగుతీస్తాడు. చివరకు కోరుకున్న హారికను అభి చేరుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
నాగార్జున సరసన సోనాలి బింద్రే నాయికగా నటించిన ఈ చిత్రంలో అన్షు, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, బాలయ్య, సుధ, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు, రంగనాథ్, తనీష్, జయప్రకాశ్ రెడ్డి, మెల్కోటే, అనంత్ బాబు, కీర్తి చావ్లా, స్వప్నమాధురి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు పలికించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. ‘అందమైన భామలూ…” అంటూ సాగే పాటను భువనచంద్ర రాయగా, మిగిలిన ఐదు పాటలనూ సిరివెన్నెల రాశారు. “డోన్ట్ వర్రీ బీ హ్యాపీ…”, “గుండెల్లో ఏముందో…”, “నేను నేనుగా లేనే…”, “నా మనసునే…”, “చెలియా చెలియా…” అనే పాటలూ అలరించాయి. ఈ చిత్రాన్ని తమ అన్నపూర్ణ సినీస్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మించారు.
ఈ సినిమా కథ, గతంలో యద్దనపూడి సులోచనారాణి రాసిన ‘గిరిజా కళ్యాణం’ను పోలి ఉంటుంది. అందులోనూ హీరో తన ప్రేయసి మరణంతో స్త్రీ ద్వేషిగా మారి ఉంటాడు. ‘మన్మథుడు’ చిత్రం మంచి విజయం సాధించింది. 2002 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా చోటు సంపాదించింది. ఈ చిత్రాన్ని కన్నడలో నటుడు ఉపేంద్ర ‘ఐశ్వర్య’ పేరుతో రీమేక్ చేశారు. నేడు యావద్భారతాన్నీ అలరిస్తోన్న దీపికా పదుకొణే ఈ ‘ఐశ్వర్య’ చిత్రంతోనే నటిగా మారడం విశేషం! బెంగాలీలో ‘ప్రియోతొమ’ గా రీమేక్ అయింది. ‘మన్మథుడు’ టైటిల్ ను అనుసరిస్తూ 2019లో నాగార్జున ‘మన్మథుడు-2’ రూపొందింది. అయితే ఆ సినిమా ‘మన్మథుడు’ స్థాయిలో అలరించలేక పోయింది.