జాతీయ స్థాయి షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ లైంగిక ఆరోపణల కేసులో చిక్కుకున్నాడు. 17 ఏళ్ల మహిళా షూటర్‌పై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలతో హర్యానా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. బాధిత క్రీడాకారిణి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్ నిట్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా.. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న జాతీయ స్థాయి షూటింగ్ పోటీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రదర్శనను అంచనా వేస్తానని చెప్పి ఫరీదాబాద్‌లోని ఓ హోటల్‌కు రావాలని కోచ్ అంకుష్ భరద్వాజ్ మహిళా షూటర్‌ను పిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట హోటల్ లాబీలో కలవాలని చెప్పి, ఆ తర్వాత బలవంతంగా గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని వెంటనే అందజేయాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు ఫరీదాబాద్ పోలీసుల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ యశ్‌పాల్ యాదవ్ తెలిపారు. సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోందన్నారు.
Also Read: AUS vs ENG 5th Test: ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయం.. ఉస్మాన్ ఖవాజాకు ఘన వీడ్కోలు!
మైనర్‌పై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో అంకుష్ భరద్వాజ్‌పై పోక్సో చట్టం సెక్షన్ 6తో పాటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 351(2) కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడితే తన కెరీర్‌ను నాశనం చేస్తానని, కుటుంబానికి హాని చేస్తానని కోచ్ బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మానసిక ఆవేదనకు గురై హోటల్‌ను వదిలి వెళ్లిన యువతి.. అనంతరం కుటుంబ సభ్యులకు విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించిన 13 మంది జాతీయ పిస్టల్ కోచ్‌లలో అంకుష్ భరద్వాజ్ ఒకడు. ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే అతడిని అన్ని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు NRAI సెక్రటరీ జనరల్ పవన్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు అతడికి ఎలాంటి కొత్త బాధ్యతలు అప్పగించబోమని స్పష్టం చేశారు.