Afghanistan: టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్-12 దశలో ఆప్ఘనిస్తాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే చివరి మ్యాచ్‌లో మాత్రం ఆస్ట్రేలియాపై గెలిచినంత పనిచేసింది. చివరకు 4 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. మెగా టోర్నీలో ఒక్క విజయం కూడా లేకుండా తమ జట్టు నిష్క్రమించడంతో ఆప్ఘనిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ నబీ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ సందర్భంగా టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేశాడు. జట్టు ఎంపికలో టీమ్ మేనేజ్‌మెంట్ సరిగ్గా వ్యవహరించలేదని.. దీంతో జట్టు కూర్పు దెబ్బతిన్నదని నబీ తెలిపాడు.
Read Also: ఆ సినిమాల కోసం బరువు పెరిగిన హీరోయిన్లు వీరే..
టీ20 ప్రపంచకప్‌లో తమ ఆటగాళ్లు, అభిమానులు ఆశించని విధంగా తమ ప్రయాణం ముగిసిందని నబీ అన్నాడు. ఈ టోర్నీకి తమ ప్రిపరేషన్స్ ఒక కెప్టెన్‌కు సంతృప్తినిచ్చే స్థాయిలో లేవని పేర్కొన్నాడు. చాలా విషయాల్లో జట్టు మేనేజ్‌మెంట్, సెలక్టర్లు, తాను ఏకాభిప్రాయానికి రాలేకపోయామని.. ఇది జట్టుపై ప్రభావం చూపిందన్నాడు. అందుకే కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతున్నట్లు నబీ స్పష్టం చేశాడు. సెలెక్టర్లు తనను జట్టులోకి ఎంపిక చేస్తే ఆటగాడిగా దేశానికి సేవలు అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపాడు. కాగా ఆప్ఘనిస్తాన్ సూపర్-12 దశలో ఆరు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలను చవిచూసింది. రెండు మ్యాచ్‌లు మాత్రం వర్షం కారణంగా రద్దయ్యాయి.