(జూన్ 26న ‘సప్తపది’కి 40 ఏళ్ళు)
తన చిత్రాలలో సమతాభావాన్ని, సమానత్వాన్ని చాటుతూ చిత్రాలను రూపొందించారు కళాతపస్వి కె.విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అనేక చిత్రాలలో సమాజంలోని ఛాందసభావాలపై నిరసన గళం వినిపించారు. జనం మారాలని కోరుకున్నారు. ‘కళ కళ కోసం కాదు ప్రజాశ్రేయస్సు కోసం’ అన్న మాటను తు.చ. తప్పక పాటించారు. ‘మన ఆచారవ్యవహారాలు మనిషిని సన్మార్గంలో పయనింపచేయడానికే కానీ, కులం పేరుతో మనుషులను విడదీయడానికి కాదు’ అంటూ పలుమార్లు విశ్వనాథుని చిత్రాలు నినదించాయి. ఆ కోవలో వెలుగు చూసి, అందరినీ ఆలోచింప చేసిన కళాత్మక చిత్రం ‘శంకరాభరణం’. ఆ తరువాత అదే రీతిన కళాతపస్వి రూపొందించిన సినిమా ‘సప్తపది’. కట్టుకున్న భార్యలో అమ్మవారిని చూసిన వ్యక్తి, ఆమెతో కాపురం చేయలేనంటాడు. ఆ అమ్మాయి మనసును మరో మనిషి ఆకర్షిస్తాడు. అతడు హరిజనుడు కావడంతో ఆ ఇంటి పెద్దకు తన కోడలిని అతనికిచ్చి ఎలా చేయాలో పాలుపోదు. సనాతన సంప్రదాయం అతని అడుగులకు అడ్డు తగులుతుంది. ఆ సమయంలో ‘శంకరాచార్యుల వారి బాణీ’నే అనుసరించాలని ఆ సంప్రదాయ కుటుంబపెద్ద నిర్ణయించడంతో ‘సప్తపది’ సాగుతుంది. నిజానికి ఈ తరహా కథలు ఇప్పటికీ వస్తున్నాయి. కానీ, నలభై ఏళ్ళ క్రితమే ఈ కత్తిమీద సామును సునాయాసంగా చేసి అలరించారు కళాతపస్వి. ఆయన తపస్సులోంచి ఉద్భవించిన ఈ కథాంశమే ‘సప్తపది’గా రూపొంది, 1981 జూన్ 26న జనం ముందు నిలచింది.
భక్తి – సంప్రదాయం – కులం
సంప్రదాయానికి ప్రాణం పెట్టే యాజులు మనవడు గౌరీనాథుడు పరమభక్తుడు. తాత అడుగుజాడల్లోనే నడుస్తూ ఉంటాడు. అతను ఆ ఊరి గుడికి కాబోయే పూజారి. గౌరీనాథ్ కు హేమ అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. శోభనం రోజున గదిలోకి వెళ్ళిన గౌరీనాథ్ కు భార్య హేమలో అమ్మవారి రూపం కనిపిస్తుంది. ఆమెతో కాపురం చేయలేనని చెబుతాడు. ఆమెకు నాట్యంలో ప్రావీణ్యం ఉంటుంది. ఆమె ఆటకు తగ్గ పాటను పలికించే హరిబాబు కనిపిస్తాడు. ఇరువురి మనసులు కలుస్తాయి. యాజులు కూడా తన మనవడి పరిస్థితి అర్థం చేసుకుంటాడు. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేక, ఆమె కోరుకున్న వాడితో వివాహం చేయించాలనుకుంటాడు. అయితే హరిబాబు హరిజనుడు అని ఆగిపోతాడు. ఆ సమయంలో యాజులుకు ఆ ఊరి రాజుగారు అంటరానివాడిని ఆదరించిన శంకరభగవద్పాదుల మార్గంలో నడచుకోమని సలహా ఇస్తాడు. ఊరు అందరూ వ్యతిరేకించినా, వారికి ఆచారవ్యవహారాల్లోని అసలు విషయాలు విడమరచి చెబుతారు యాజులు. తన మనవడి భార్యను ఆమె కోరుకున్న హరికి ఇచ్చి సాగనంపుతాడు యాజులు. ఇదీ ‘సప్తపది’ చిత్రకథ.
అలరించిన గీతాలు…
ఈ కథను ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా కె.విశ్వనాథ్ నడిపిన తీరు ఆకట్టుకుంటుంది. అందుకే ఈ సినిమా ద్వారా ఆయనకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు లభించింది. ఈ చిత్రానికి జంధ్యాల సందర్భోచితంగా మాటలు పలికించారు. ఇక వేటూరి కలం కురిపించిన సాహిత్యం కేవీ మహదేవన్ సంగీతంతో జతగా సాగి, పండితపామరులను ఆకట్టుకుంది. ఇందులో ఆదిశంకరాచార్య ‘మహిషాసుర మర్ధిని స్త్రోత్రాన్ని’ సందర్భోచితంగా వినియోగించుకున్నారు. అలాగే ‘మంత్రపుష్పం’ను, త్యాగరాజ కృతి “మరుగేలరా ఓ రాఘవా…”ను కూడా సందర్భశుద్ధితోనే చొప్పించారు. ‘భామనే సత్యభామనే…’ కీర్తనను వడియాలు పెడుతూ చిత్రీకరించడం చాలా అందంగా అమరింది. ఇక మిగిలిన పాటలన్నీ వేటూరి కలం నుండి జాలువారినవే! “ఏ కులమూ నీదంటే…”, “గోవుళ్లు తెల్లన… గోధూళి ఎర్రన…”, “నెమలికి నేర్పిన నడకలివి…”, “వ్రేపల్లియ యెద ఝల్లన …”, “అఖిలాండేశ్వరి…” పాటలు ఈ నాటికీ పరవశింప చేస్తూనే ఉన్నాయి.
విశేషాలు…
‘సప్తపది’ చిత్రంలో నటించిన సబిత తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. నాట్యకళలో రాణిస్తూ, ఉద్యోగం చేసుకుంటూ సాగారు సబిత. ఈ చిత్రంలో హరిబాబు పాత్ర పోషించిన గిరీశ్ తరువాతి రోజుల్లో ‘సప్తపది’ గిరీశ్ గా రాణించారు. ఇందులో “గోవుళ్ళు తెల్లన…” పాటలో గుండుతోనూ, పిలకతోనూ కనిపించిన బాలనటుడు మాస్టర్ రవి, ఇప్పుడు విలన్ గానూ, తన గాత్రంతోనూ అలరిస్తున్న రవిశంకర్. నిజజీవితంలో అన్నదమ్ములైన సోమయాజులు, రమణమూర్తి ఇందులో తండ్రీకొడుకులుగా నటించారు. గౌరీనాథ్ పాత్రలో రవికాంత్ అలరించాడు.
హిందీలోనూ…
జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కొన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ‘ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం’గా నర్గీస్ దత్ అవార్డు లభించింది. అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ చిత్రం తరువాతి రోజుల్లో ‘జాగ్ ఉఠా ఇన్సాన్’ పేరుతో హిందీలో రీమేక్ అయింది. ఆ చిత్రానికి కూడా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అందులో శ్రీదేవి, మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రధారులు. ‘జాగ్ ఉఠా ఇన్సాన్’ చిత్రాన్ని హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ నిర్మించి, అందులో కీలకమైన నందు పాత్రను పోషించారు.