Lala Lajpat Rai Birth Anniversary: భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ‘లాల్-బాల్-పాల్’ త్రయం గురించి వినని వారు ఉండరు. అందులో అత్యంత శక్తివంతమైన నాయకుడు, పంజాబ్ కేసరిగా పిలవబడే లాలా లాజపత్ రాయ్. 1865, జనవరి 28న పంజాబ్‌లోని మోగా జిల్లాలో జన్మించిన ఆయన, తన మాటలతో, చేతలతో దేశవ్యాప్తంగా విప్లవ జ్వాలలను రగిలించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి పోరాటాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.
లాల్-బాల్-పాల్ త్రయంలో కీలక శక్తి
లాలా లాజపత్ రాయ్ అతివాద నాయకుడిగా పేరుగాంచారు. బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్‌లతో కలిసి ఆయన స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఊపిరి పోశారు. కేవలం విజ్ఞప్తులతో స్వాతంత్ర్యం రాదని, పోరాడి సాధించుకోవాలని నమ్మిన వ్యక్తి ఆయన. స్వదేశీ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో, విదేశీ వస్తువులను బహిష్కరించడంలో ఆయన చేసిన కృషి అనన్యం. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఆయన పత్రికలను, విద్యాలయాలను వేదికగా చేసుకున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్థాపన , విద్యా సేవలు
లాలా లాజపత్ రాయ్ కేవలం రాజకీయ నాయకుడే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. భారతీయుల ఆర్థిక స్వావలంబన కోసం 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ను స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వదేశీ బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని ఆ రోజుల్లోనే ఆయన కలలు గన్నారు. అలాగే, దయానంద సరస్వతి బోధనలకు ప్రభావితుడై ‘ఆర్య సమాజ్’లో చేరి, అనేక విద్యా సంస్థల స్థాపనకు (DAV Schools) పునాదులు వేశారు.
సైమన్ కమిషన్ వ్యతిరేక పోరాటం – అమరత్వం
1928లో సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు “సైమన్ గో బ్యాక్” అంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. లాహోర్‌లో జరిగిన నిరసన ప్రదర్శనకు లాలా లాజపత్ రాయ్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో బ్రిటీష్ పోలీసులు జరిపిన క్రూరమైన లాఠీ ఛార్జీలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆ గాయాలతోనే పోరాడుతూ 1928, నవంబర్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు. చనిపోయే ముందు ఆయన అన్న “నా శరీరంపై పడే ప్రతి లాఠీ దెబ్బ, బ్రిటీష్ సామ్రాజ్య శవపేటికకు కొట్టే ఒక్కో మేకు లాంటిది.” మాటలు చరిత్రలో నిలిచిపోయాయి..
లాలా లాజపత్ రాయ్ మరణం దేశవ్యాప్తంగా విప్లవకారులను ఉర్రూతలూగించింది. భగత్ సింగ్ వంటి యువ వీరులు ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఆయన త్యాగం, ధైర్యం నేటికీ కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిదాయకం. దేశం కోసం సర్వస్వం ధారపోసిన ఆ పంజాబ్ కేసరికి ఘన నివాళులు అర్పిద్దాం.