Kushi Telugu Movie Review: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఖుషీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎలమంచిలి నవీన్, ఎర్నేని రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మలయాళ సంగీత దర్శకుడు హేషం అబ్దుల్ వాహబ్ అందించిన సంగీతం సినిమాని మరో లెవెల్ కి తీసుకు వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అంచనాలకు తగినట్లుగా సినిమా ఉందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.
ఖుషి కథ ఏమిటంటే?
నాస్తిక సంఘం అధ్యక్షుడిగా ఉన్న లెనిన్ సత్యం (సచిన్ ఖేడ్కర్) కుమారుడు విప్లవ్(విజయ్ దేవరకొండ) ఎలా అయినా గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతని ప్రయత్నం ఫలించి బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం దొరుకుతుంది, ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్ లో రావడంతో అక్కడికి పయనమవుతాడు. అదే సమయంలో అక్కడికి ఆఫీస్ ట్రిప్ కోసం వచ్చిన ఆరాధ్య(సమంత)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఆరాధ్య మాత్రం తాను ఒక ముస్లిం అమ్మాయిలా కవరింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే చివరికి విప్లవ్ ప్రపోజ్ చేయడంతో తాను ముస్లిం అమ్మాయిని కాదని బ్రాహ్మణ అమ్మాయిని చెప్పేస్తుంది అదే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆరాధ్య రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం చాలా గౌరవించే ప్రవచనకర్త చదరంగం శ్రీనివాసరావు(మురళీ శర్మ) కుమార్తె. పిల్లలిద్దరి కోసం పెద్దలకు ఇష్టం లేకపోయినా వివాహం జరిపించేందుకు సిద్ధమైన క్రమంలో వీరిద్దరి జాతకాలు పొసగడం లేదని బాంబు పేలుస్తాడు చదరంగం శ్రీనివాసరావు.. పెళ్లి జరిగినా సంతానలేమి, గొడవలు లాంటి సమస్యలు వస్తాయని, అయితే ఒక హోమం విప్లవ్ తన తండ్రితో కలిసి చేస్తే సమస్యలు లేకుండా ఉంటాయని చెబుతాడు. అయితే తల్లిదండ్రులు ఒప్పుకునేలా కనిపించడం లేదని విప్లవ్ , ఆరాధ్య బయటకు వచ్చి వివాహం చేసుకుంటారు.. ఈ క్రమంలో వారిద్దరి జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యల నుంచి విప్లవ్, ఆరాధ్య బయటపడ్డారా? చదరంగం శ్రీనివాసరావు చెప్పిన సమస్యలు ఎలా తీరాయి? తనకు ఇష్టం లేకుండా వివాహం చేసుకున్న కుమారుడిని లెనిన్ సత్యం స్వీకరించాడా? లేదా? లాంటి వివరాలు అన్ని తెరమీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ముందు నుంచి ఈ సినిమా దర్శకుడు శివ నిర్మాణ ఇదేదో కొత్త కథ అని, అద్భుతమైన కథ అని చెప్పడం లేదు అని చెబుతూనే వచ్చాడు. సినిమా చూస్తున్నంత సేపు ఆయన చెప్పినది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం ఎప్పటినుంచో చూస్తూ వచ్చిన అనేక ప్రేమ కథల్లో ఒకటి లాగా అనిపిస్తుంది. హీరోయిన్ ని చూసి మొదటి చూపులోనే హీరో ప్రేమలో పడటం, ఆమె ఐడెంటి మార్చుకొని అక్కడ ఉందనే విషయం తెలియక ఆమెను ఇంప్రెస్ చేయాలని తాపత్రయపడటం చూపించారు. తర్వాత ఆమె ఎవరు అనే విషయం తెలిసి కూడా ఆమెనే వివాహం చేసుకోవాలని వెంటపడడం ఇలా ఫస్ట్ ఆఫ్ అంతా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్ కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. కాశ్మీర్ నేపథ్యంలో లొకేషన్లు అన్నింటినీ చాలా జాగ్రత్తగా అత్యద్భుతంగా ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశాడు. వెన్నెల కిషోర్, విజయ్ దేవరకొండ మధ్య కామెడీ బాగా వర్క్ అవుట్ అయింది.
ఇక విజయ్ దేవరకొండ సమంత ప్రేమలో పడి వివాహం చేసుకోవడంతో సెకండ్ హాఫ్ ఆసక్తికరంగా మొదలవుతుంది.. అన్ని పెళ్లిళ్లలో లాగానే వీరిద్దరి మధ్య కూడా చిన్న చిన్న విషయాల్లో గొడవలు రావడం, తర్వాత తన తండ్రి చెప్పిన హోమం చేయకపోవడం వల్లే ఇలా గొడవలు వస్తున్నాయని సమంత భావించడం చూపించారు. అది విజయ్ దేవరకొండకు సమంతకు మధ్య ఇంకా దూరం పెరిగేలా చేయడం వంటి సీన్లు ఆసక్తికరంగా డిజైన్ చేసే ప్రయత్నం చేశారు. లక్షలాది మంది ప్రజలను సనాతన మార్గం వైపు నడిపించే ఒక వ్యక్తి కుమార్తె నాస్తిక సంఘం అధ్యక్షుడు కుమారుడుతో ప్రేమలో పడి వివాహం చేసుకుంటే ఆ ప్రవచనకర్త, నాస్తిక సంఘం అధ్యక్షుడి మనస్థితి ఎలా ఉంటుంది? వారి కుమారుడు, కుమార్తెగా విజయ్ దేవరకొండ సమంత ఎలాంటి స్ట్రగుల్స్ కి లోనయ్యారు లాంటి విషయాలను ఎక్కడా వివాదాలు జోలికి వెళ్లకుండా హృద్యంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
అయితే ఓవరాల్ గా నిడివి కొంచెం ఎక్కువ అనిపించినా సరే ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు సంప్రదాయాలు సిద్ధాంతాలు అన్నీ మనిషి నిర్మించుకున్నవే.. వీటన్నిటికంటే ముందు మనిషి మనిషిగా బతికితే అంతకు మించి గొప్ప విషయం ఏదీ లేదనే విషయాన్ని సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. శాస్త్రాలు, సిద్ధాంతాలు అన్నీ మనిషి ప్రేమ ముందు బలాదూర్ అని బలంగా బల్లగుద్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా నిడివి ఒక్కటి పక్కనపెడితే ఫ్యామిలీస్ కి నచ్చే ఎలిమెంట్స్ బాగున్నాయి. అదేసమయంలో సమంత, విజయ్ దేవరకొండ మధ్య రొమాన్స్ పాళ్లు తగ్గించి ఉంటే మరింతగా ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎవరు ఎలా చేశారు అంటే
విజయ్ దేవరకొండ పాత్ర డిజైన్ చేసిన విధానం చూస్తే గీతగోవిందంలో విజయ్ పాత్రను పోలినట్లే అనిపిస్తుంది. దేనికీ వెనుకాడని మనస్తత్వం ఉన్న వ్యక్తి కూడా తన ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత దూరమైనా వెళ్లి ఏదైనా చేసే కుర్రాడి పాత్రలో విజయ్ లీనమైపోయాడు.. సమంత గురించి చెప్పాల్సిందేముంది? ఈ సినిమాలో కూడా నటన విషయంలో ఎక్కడా వంక పెట్టే అవకాశం లేకుండా నటించింది. అయితే ఎక్స్ప్రెషన్స్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఆమె ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఈ విషయం మీద కేర్ తీసుకోలేదేమో అని కొన్ని సీన్స్ లో ఆమె ఎక్స్ ప్రెషన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. ఇక సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, శరణ్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్, ఫిదా శరణ్య, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి వారు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సీనియర్ నటి లక్ష్మి, విలన్ పాత్రల్లో ఎక్కువగా నటించే శత్రు ఇద్దరికీ మంచి పాత్రలు దొరికాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ప్రత్యేకంగా ఇప్పటికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన అందించిన మ్యూజిక్ ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ గా సరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా హేషం ఎక్కడ తగ్గలేదు. ఇక మురళి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. ముఖ్యంగా కాశ్మీర్ లాంటి లొకేషన్లను మరింత అందంగా తెరకెక్కించి అందరికీ చూపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎడిటింగ్ టేబుల్ మీద మరి కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది..
ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే:
ఖుషి విప్లవ్-ఆరాధ్యల అందమైన ప్రేమ కథ.. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా