‘వాసి’ చిత్రం చూసిన వారికి బాపు తెరకెక్కించిన ‘రాధాగోపాళం’ లాంటి తెలుగు చిత్రాలు గుర్తుకు రాకమానవు. ఎందుకంటే లాయర్లయిన భార్యాభర్తలిద్దరూ ఒకే కేసులో ఇరు పక్షాల తరపున వాదనలు వినిపించే ఆసక్తికరమైన కథ ‘వాసి’లోనూ చోటు చేసుకుంది.
ఇక ‘వాసి’ కథ విషయానికి వస్తే, అడ్వోకేట్ ఎబిన్, అడ్వోకేట్ మాధవి ఇద్దరూ కోర్టులో కేసుల కోసం ఎదురుచూసే పరిస్థితి. అయితే ఓ సీనియర్ లాయర్ వద్ద పనిచేస్తూ మాధవికి మంచి అనుభవం ఉంటుంది. ఎబిన్ మాత్రం మిత్రుని ఆఫీసునే తన కార్యాలయం అని చెప్పుకుంటూ ఎలాగోలా కేసులు పట్టేసుకొని నెట్టుకొస్తూ ఉంటాడు. ఈ ఇద్దరికీ మరో సీనియర్ లాయర్ సతీశ్ తో మంచి అనుబంధం ఉంటుంది. ఎబిన్, మాధవి ఇద్దరూ పోటీపడుతూ ఉంటారు. చివరకు ఓ ఆఫీస్ తీసుకొనే విషయంలోనూ పోటీపడి, సతీశ్ సూచనతో ఇద్దరూ ఒకే ఆఫీస్ ను రెండుగా చేసుకొని సాగుతుంటారు. ఎబిన్ బావకు మంచి పలుకుబడి ఉండడంతో అతనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యే అవకాశం దక్కుతుంది. ఎబిన్, మాధవి మతాలు వేరైనా మనసులు ఇచ్చిపుచ్చుకోవడంతో, వారి పెద్దలు మొదట్లో వీలుకాదనుకున్నా, వారికి పెళ్ళి చేస్తారు. గౌతమ్ అనే అబ్బాయి, అనూష అనే అమ్మాయిని నమ్మించి మోసం చేశాడనే కేసు వస్తుంది. ఆ కేసులో అబ్బాయి, మాధవి ఫ్యామిలీ ఫ్రెండ్ తమ్ముడు. దాంతో అతని పక్షాన ఆమె నిలుస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అమ్మాయి పక్షాన ఎబిన్ ఉంటాడు. ఆ కేసులో ఇద్దరూ గెలవాలనుకుంటారు. మాధవిని ఎబిన్ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేని అతని బావ, ‘కేసు ఓడిపోయి పెళ్ళాం చాటుమొగుడు’ అని పేరు తెచ్చుకోకు అని అంటాడు. దాంతో ఎబిన్ సైతం ఛాలెంజ్ గా తీసుకుంటాడు. ఆ మాట విన్న మాధవి ఆ కేసును తానూ ఓ సవాల్ గానే భావిస్తుంది. ఇద్దరూ పంతంతో సవాళ్ళు విసరుకుంటారు. తాను ఓడిపోతే పి.పి. పదవికి రాజీనామా చేసి, మళ్ళీ ఆఫీసులో అడ్వకేటుగానే ప్రాక్టీస్ చేస్తానంటాడు ఎబిన్. ఒకే ఇంట్లో ఉన్నా, వారిద్దరి మధ్య మాటలు కరువవుతాయి. కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి. చివరి దశకు చేరుకున్న సమయంలో ఎబిన్ తో అనూష – కేసులో గౌతమ్ దోషి అని తేలితే ఎంతకాలం శిక్ష పడుతుందని అడుగుతుంది. పది లేదా పదిహేనేళ్ళు పడుతుందని ఎబిన్ అంటాడు. దాంతో తన వల్ల గౌతమ్ జీవితం పాడు కాకూడదని అనూష విలపిస్తుంది. అదే సమయంలో గౌతమ్ కూడా తాను అనూషను పెళ్ళి చేసుకుంటే, శిక్ష పడదు కదా అని మాధవిని కోరతాడు. ఈ సమయంలో అది కుదరదని మాధవి చెబుతుంది. వాదోపవాదాలు పూర్తువుతాయి. చివరకు జడ్జి “ఈ కేసులో ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలు చూపలేకపోయింది. అయినా, నిందితుడు గౌతమ్, అమ్మాయి అనూష ఇద్దరూ తాగి కలుసుకోవడం నేరమేనని, అందుకు గౌతమ్ కు కోర్టు శిక్ష విధిస్తోంది” అంటూ తీర్పు చెబుతాడు. అంతకు ముందే గౌతమ్ అక్క తన తమ్ముని కేసు కారణంగా, నీ జీవితాన్ని బలి చేసుకోవద్దు అని మాధవికి చెబుతుంది. అలాగే ఎబిన్ కు సతీశ్ కూడా పంతానికి పోయి మీ ఇద్దరూ అశాంతికి గురికావద్దు అని అంటాడు. దాంతో వారిద్దరి మనసులు విప్పి మాట్లాడుకుంటారు. కేసు గెలిచినందుకు ఎబిన్ కు అభినందనలు తెలుపుతుంది మాధవి. అలాగే తరువాత తాము హై కోర్టుకు పోతామనీ చెబుతుంది. పట్టువదలవన్న మాట అంటాడు ఎబిన్. దాంతో కథ ముగుస్తుంది.
స్త్రీపురుషులు ఇద్దరూ సమానులే అనే భావనతో సాగే లాయర్ గా మాధవి పాత్ర రూపొందింది. ఇది అచ్చు ‘రాధాగోపాళం’లో రాధ పాత్రను తలపిస్తుంది. లాయర్ మాధవిగా కీర్తి సురేశ్, ఎబిన్ గా టోవినో థామస్ తమ పాత్రల పరిధి దాటకుండా నటించారు. మిగిలిన పాత్రధారులు సైతం ఆకట్టుకున్నారు. నిజానికి కేసులో అమ్మాయి తాను ప్రేమించినవాడు మోసం చేశాడని కేసు పెట్టినా, అతని భవిష్యత్ గురించి ఆలోచిస్తుంది. అలాగే అబ్బాయి సైతం ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అంటాడు. ఈ కోణంలో అటు ఇటు భార్యాభర్తలే న్యాయవాదులుగా ఉన్నప్పుడు ఎంత మాట్లాడుకోకపోయినా, కేసును ఓ కొలిక్కి తీసుకు రావచ్చు. అయితే ‘వాసి’ అంటే పంతం అనే టైటిల్ జస్టిఫికేషన్ జరగడానికి అన్నట్టు లాయర్ మాధవి ఇక్కడ ఓడిపోయినా హై కోర్టుకు పోతానని చెప్పించినట్టుగా ఉంది. ఏది ఏమైనా ఈ మధ్య వస్తున్న మళయాళ చిత్రాలు ముగింపును ప్రేక్షకుల ఊహకే వదిలేస్తూ రూపొందుతున్నాయి. తద్వారా తామేదో క్రియేటివిటీ చూపిస్తూ ఎండింగ్ ఇస్తున్నామని భావిస్తే పొరపాటే. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ అవుతున్నాయో ఆలోచించాలి. ఇక ఈ మధ్యకాలంలో కోర్టు డ్రామాలను ప్రేక్షకులు బాగానే ఇష్టపడుతున్నారు. అందువల్ల ఓటీటీల్లో ఇలాంటి కోర్టు రూమ్ డ్రామాలకు ఆదరణ బాగానే ఉంది. అది ఎంతకాలం సాగుతుందో కానీ, ఈ ట్రెండ్ నే ఫాలో అవుతూ పాతకథలకు కొత్త సొబగులు తొడుగుతూ పోతే జనానికీ మొహం మొత్తవచ్చు.
ఇక దర్శకుడు కోర్టు రూమ్ సన్నివేశాలనే కాదు, హీరో, హీరోయిన్ మధ్య సాగే పలు అంశాలను సహజత్వానికి దగ్గరగానే తెరకెక్కించారు. కథానుగుణంగా కెమెరా సాగింది. సంగీతం సైతం అదే తీరున ఆకట్టుకుంది.
ప్లస్ పాయింట్స్:
– ఆకట్టుకొనే కోర్టు సీన్స్
– నటీనటులు అభినయం
– అలరించే సినిమాటోగ్రఫి, సంగీతం
మైనస్ పాయింట్స్:
– కథలో కొత్తదనం లేకపోవడం
– ద్వితీయార్ధం సాగదీసినట్టుగా ఉండడం
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్: ‘వాసి’… అంతగాలేదు!