NTV Telugu Site icon

True Lover Movie Review: ‘ట్రూ లవర్’ మూవీ రివ్యూ!

True Lover Movie Review

True Lover Movie Review

True Lover Movie Review: మణికందన్, గౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా ప్రభూరామ్ వ్యాస్ దర్శకత్వంలో తమిళంలో లవర్ అనే సినిమా తెరకెక్కింది. అదే సినిమాని తెలుగులో ట్రూ లవర్ పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్.కె.ఎన్. గతంలో వీరికి యూత్ ఫుల్ సినిమాలు చేసిన అనుభవం ఉండడంతో పాటు ప్రమోషన్స్ కూడా ఈ ట్రూ లవర్ సినిమాకి పెద్ద ఎత్తున చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తి మరింత పెంచే విధంగా టీజర్, ట్రైలర్ ఉండడంతో యూత్ అంతా ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఇక ఈ సినిమా తమిళంలో ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కాగా తెలుగులో ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ అవుతుంది. ఒక రోజు ముందుగానే సెలబ్రిటీ స్పెషల్ ప్రీమియర్ కూడా ప్రదర్శించింది సినిమా యూనిట్. ఈ నేపద్యంలో సినిమా ఎలా ఉంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూసి తెలుసుకుందాం.

ట్రూ లవర్ కథ:
దివ్య (గౌరీ ప్రియ), అరుణ్ (మణికందన్) ఇద్దరూ కాలేజీ రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే దివ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉండగా ఇంట్లో 15 లక్షలు తీసుకుని ఒక కాఫీ షాప్ పెట్టడానికి అరుణ్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దివ్య తన తోటి ఉద్యోగస్తులతో కాస్త క్లోజ్ గా ఉండడంతో ఆమె వారితో ఎక్కడ ప్రేమలో పడుతుందో అని కొంచెం పొసెసివ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు అరుణ్. అతని అనుమానం తట్టుకోలేక ఎక్కడ ఉన్నానో అనే విషయాన్ని సైతం దాచేసే స్థితికి దివ్య చేరుకుంటుంది. ఆఫీస్ ఫ్రెండ్స్ తో ఉన్నాను అని చెబితే ఎక్కడ అరుణ్ తో ఇబ్బంది కలుగుతుందోనని ఎప్పటికప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా చెప్పిన ప్రతిసారి కొద్దిసేపటికే అరుణ్ కి దొరికిపోవడం పెద్ద గొడవ అవ్వడం, అరుణ్ రాద్ధాంతం చేసి చివరికి సారీ చెప్పడం సర్వసాధారణం అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో దివ్య కోసమే ఒక ఉద్యోగంలో చేరతాడు అరుణ్. అయితే కాఫీ షాప్ పనుల్లో పడి ఉద్యోగం నిర్లక్ష్యం చేయడంతో అతని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఆ విషయం దివ్యకి చెప్పకుండా మేనేజ్ చేస్తున్న సమయంలో ఒక అనూహ్యమైన పరిస్థితుల్లో అరుణ్ దివ్యకు దొరికిపోతాడు. ఇక ఇక్కడితో రిలేషన్ కి బ్రేక్ వేద్దాం అని దివ్య చెప్పడంతో ఎలా అయినా దివ్యని ఒప్పించి రిలేషన్ కంటిన్యూ చేయాలని అరుణ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. మద్యం తాగడం లేదా సిగరెట్లతో ప్రతిక్షణం ప్రయాణిస్తున్న అరుణ్ దివ్యను చేరుకున్నాడ? అసలు దివ్య మీద అరుణ్ కి అంత అనుమానం కలగడానికి కారణం ఏంటి? దివ్య, అరుణ్ చివరికి ఏకమయ్యారా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
ప్రేమను ఆధారంగా చేసుకుని తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అదే ప్రేమను ఆధారంగా చేసుకుని వచ్చిన సరికొత్త సినిమా ట్రూ లవర్. ట్రూ లవర్ అంటే అర్థం నిజమైన ప్రేమికుడు అని. ఈ సినిమా మొత్తం మోడర్న్ యూత్ మధ్య మధ్యలో జరిగిన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ రోజుల్లో అనుమానాన్ని పొసెసివ్నెస్ పేరుతో కప్పిపుచ్చుకుంటూ అదే నిజమైన ప్రేమ అంటూ యువత ఎటువైపు పయనిస్తోంది? అని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చలు చూస్తూ ఉంటాం. అలా కాకుండా నిజంగానే ఒక కుర్ర జంట ఈ అనుమానపు ప్రేమ వల్ల ఎలా మానసిక క్షోభకు గురయ్యారు? దీనివల్ల వారి జీవితాలు ఎలా ప్రభావితమయ్యాయి అనే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కలిసిన కొద్ది రోజుల్లోనే ప్రేమలో పడటం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఇంకా ఎవరితో అయినా క్లోజ్ గా మాట్లాడినా తట్టుకోలేక మితి మీరి ప్రవర్తించడం వంటి వాటితో హీరో క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తూనే అతని వద్ద నిజాలు దాస్తూ అతనికి భయపడుతూ బతుకుతున్న హీరోయిన్ క్యారెక్టర్ ని కూడా సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే దర్శకుడు ఎస్టాబ్లిష్ చేశాడు. నిజానికి గొడవ తర్వాత కలిసిపోవడం, మళ్లీ గొడవ – మళ్లీ కలిసి పోవడం ఇలాంటి సీన్స్ చూసి చూసి కాస్త సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు ఇది ఒక సినిమా లాగా కాకుండా ఏదో ఒక కాలేజీలో లేదా ఆఫీసులో సీసీ కెమెరా పెట్టి వాళ్ల జీవితాలు నిజంగా మన కళ్ళకు చూపెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. యూత్ కనెక్ట్ అవ్వాలి అనుకున్నారో లేక ఏమనుకున్నారో కానీ సినిమాలో 80 సీన్స్‌లో హీరో కనిపిస్తాడనుకుంటే… 70 సీన్స్‌కు పైగా హీరో స్మోక్‌ చేసేవే ఉంటాయి. అది లేదంటే చేతిలో గ్లాస్‌ పెట్టేశాడు దర్శకుడు. సినిమా చివరి వరకు ఒక్కటే పాయింట్‌ చుట్టూ తిప్పే ప్రయత్నం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. నిజానికి సినిమాలో చూపిన లాంటి లవర్స్‌ సమాజంలో వున్నా.. ఇంత రస్టిక్‌గా సినిమాను చూడడానికి యూత్ మాత్రమే సిద్దంగా ఉంటారు. ఇలాంటి లవర్స్‌లో తమను తాము చూసుకునే వారికి ట్రూ లవర్‌ నచ్చొచ్చు. పెద్దగా ఖర్చు లేకుండా సినిమా పూర్తి చేసింది టీం. బడ్జెట్‌ తక్కువే కాబట్టి యూత్‌ ఒక్కసారి చూసినా సినిమా బ్రేక్‌ ఈవెన్‌ ఈజీగా అయిపోతుంది. ఫ్యామిలీకి సినిమా కనెక్ట్ అవుతుందని ప్రమోషన్స్ లో నిర్మాతలు చెప్పినా ఇంకా ఇంత రస్టిక్ సినిమాలను ఓన్ చేసుకునే స్థాయికి తెలుగు తల్లిదండ్రులు వచ్చారని అనుకోలేము. ప్రేమలో ఉన్నవారు, గతంలో ప్రేమించి ప్రేమకి దూరంగా ఉన్నవారు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.

నటన:
ఇక నటీనటుల విషయానికి వస్తే లవర్స్‌గా మణికందన్‌, గౌరీ ప్రియ పోషించిన అరుణ్‌ , దివ్య పాత్రలే సినిమా మొత్తం కనిపించేంతగా పెర్‌ఫార్మెన్స్‌తో ఇంప్రెస్‌ చేశారు. ఆ తర్వాత వారి స్నేహితుల గ్యాంగ్ లో నటించిన వారు కూడా ఏదో నటిస్తున్నాం అని కాకుండా నిజంగా జీవిస్తున్నట్టు పాత్రలు చేసుకుంటూ పోయారు. ఒక రకంగా ఇది సినిమా లాగా కాకుండా నిజంగానే వాళ్ళ జీవితంలో సీసీ కెమెరాలు పెట్టి షూట్ చేసినట్లు అనిపించింది. ప్రభురామ్ వ్యాస్ చేసింది మొదటి సినిమానే అయినా యూత్ కి ఏం కావాలో అది ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు. సంగీతం కూడా సినిమాకి తగ్గట్టుగా సెట్ అయింది. ఒకటి రెండు పాటలు వినడానికి కూడా బాగున్నాయి. అయితే సినిమాటోగ్రఫీ విషయంలో మాత్రం ఎందుకో లో కలర్ పాటర్న్ ఫాలో అయినట్లు అనిపించింది. గ్రే షేడ్స్ ఎక్కువగా కనిపించాయి. ఎడిటింగ్ టేబుల్ మీద మరికొంత వర్క్ చేసి ఉండొచ్చు.

ఫైనల్లీ:
ఓవరాల్ గా ట్రూ లవర్ సినిమా యూత్ కి మాత్రమే.