దాదాపు 36 సంవత్సరాల క్రితం టామ్ క్రూయిజ్ ను హాలీవుడ్ లో టాప్ హీరోగా నిలిపిన చిత్రం ‘టాప్ గన్’. ఇన్నేళ్ళకు ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టాప్ గన్ – మావెరిక్’ వచ్చింది. అప్పట్లో ‘టాప్ గన్’లో టామ్ క్రూయిజ్ స్టైల్ చూసి ఎందరో అమ్మాయిలు మనసు పారేసుకున్నారు. ఆ రోజుల్లో టాప్ గన్ టామ్ అంటూ జేజేలు పలికారు. ఇక ప్రస్తుత ‘టాప్ గన్ : మావెరిక్’ విషయానికి వస్తే – ఇందులో కథానాయకుడు మావెరిక్ మిచెల్ 36 సంవత్సరాలయినా చెరిగిపోని స్థైర్యంతో ఫైటర్ పైలట్ గా తన సత్తా చాటుకుంటాడు. మావెరిక్ ను పదిమంది ట్రెయిన్డ్ పైలట్స్ కు ఇన్ స్ట్రక్టర్ గా నియమిస్తారు. ఆ పదిమందిలో మావెరిక్ క్లోజ్ ఫ్రెండ్ అయిన గూస్ బ్రాడ్ షా తనయుడు రూస్టర్ కూడా ఉంటాడు. తొలుత యంగ్ స్టర్స్ మావెరిక్ ఇన్ స్ట్రక్షన్స్ ను చాలా తేలికగా తీసుకుంటారు. తరువాత మావెరిక్ ఫైటర్ పైలట్ ను టార్గెట్ కు అతి సమీపంలోకి తీసుకువెళ్ళి, ఆపై దానిని అతివేగంగా పైకి తీసుకువెళ్ళే నైపుణ్యం చూసి ఆశ్చర్యపోతారు. కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం మావెరిక్, రూస్టర్ మిగతా పైలట్స్ శత్రుశిబిరాల టార్గెట్స్ పై దాడికి దిగుతారు. బాంబింగ్ మిషన్ పూర్తి చేసుకొని మిగిలిన పైలట్స్ తమ స్టేషన్ చేరుకుంటారు. కానీ, మావెరిక్, రూస్టర్ మిస్ అవుతారు. ఓ సందర్భంలో మృత్యుముఖంలోకి వెళ్ళిన మావెరిక్ ను రూస్టర్ రక్షిస్తాడు. ఇద్దరూ శత్రువులకే ఝలక్ ఇచ్చి, తమ స్టేషన్ కు చేరుకుంటారు. వారికి ఘనస్వాగతం లభిస్తుంది. తరువాత మావెరిక్ తన ప్రేయసి పెన్నీ, ఆమె కూతురును కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
‘టాప్ గన్’గా 36 ఏళ్ళ క్రితం అలరించిన టామ్ క్రూయిజ్ ఇందులోనూ అదే ఈజ్ తో నటించాడు. అయితే పెన్నీతో మావెరిక్ కెమిస్ట్రీ అంతగా రక్తి కట్టించలేదనే చెప్పాలి. ఇతర పాత్రల్లో రూస్టర్ గా మైల్స్ మిల్లర్, పెన్నీగా జెన్నీఫర్ కొన్నెల్లీ ఆకట్టుకున్నారు. మిగిలిన వారందరూ తమ పాత్రలకు తగిన న్యాయం చేసే ప్రయత్నం చేశారు. దర్శకుడు జోసెఫ్ కొసింకీ ఈ సినిమాను ‘ఇండియన్ యాక్షన్ మూవీస్ స్టైల్’లో తెరకెక్కించడం విశేషం! ఇక ఫైటర్ ఫ్లైట్స్ విన్యాసాలు పిల్లలను ఆకట్టుకొనేలా రూపొందించారు. శుక్రవారం (మే 27న) ఈ చిత్రం జనం ముందుకు రానుంది. 36 ఏళ్ళ క్రితం ‘టాప్ గన్’ను అభిమానించిన వారు ఈ సీక్వెల్ చూస్తే చూడవచ్చు.
ప్లస్ పాయింట్స్:
– ‘టాప్ గన్’ సీక్వెల్ కావడం
– టామ్ క్రూయిజ్ చిత్రం అవ్వడం
– ఆకట్టుకొనే కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్:
– ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించే సీన్స్
– కొత్తదనం లేకపోవడం
– సాగదీసిన యాక్షన్ సీన్స్
రేటింగ్: 2.25/ 5
ట్యాగ్ లైన్: మా’వర్రీ’క్!