డిసెంబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న విభిన్న కథా చిత్రం ‘జిన్’. సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో చిన్మయ్ రామ్ దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు చిన్మయ్ రామ్ తన మనోగతాని మీడియాతో పంచుకున్నారు.
కల నుంచి పుట్టిన కథ: ‘జిన్’
దర్శకుడు చిన్మయ్ రామ్ మాట్లాడుతూ, ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. “నేను కన్నడ చిత్ర పరిశ్రమలో 17 ఏళ్లుగా ఉన్నాను. అక్కడ రెండు సినిమాలు కూడా చేశాను. అయితే నా మిత్రుడు పర్వేజ్ సింబాకు ఒకరోజు వచ్చిన ఒక వింత కలలో నుంచి ఈ ‘జిన్’ కాన్సెప్ట్ పుట్టింది. ఆ పాయింట్ వినగానే నాకు చాలా కొత్తగా అనిపించి ఈ కథను సిద్ధం చేశాను” అని ఆయన తెలిపారు. తెలుగులో తన తొలి ప్రయత్నం ఇంత భారీగా జరుగుతుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సినిమా ఇంత క్వాలిటీగా రావడానికి నిర్మాత నిఖిల్ ఎం. గౌడ ఇచ్చిన సహకారమే కారణమని దర్శకుడు కొనియాడారు. “నిఖిల్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. ఎక్కడా రాజీ పడకుండా సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారు” అని పేర్కొన్నారు. ఇక సాంకేతిక నిపుణుల గురించి చెబుతూ.. సంగీత దర్శకుడు అలెక్స్ ఈ చిత్రానికి ‘మొదటి హీరో’ అని, సునీల్ విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
షూటింగ్ సెట్‌లో వింత అనుభవాలు
కేవలం తెర మీద మాత్రమే కాదు, షూటింగ్ సమయంలో కూడా చిత్ర యూనిట్‌కు కొన్ని భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయట. సెట్‌లో లైట్లు దానంతట అవే ఆరిపోవడం. కెమెరాలు అకస్మాత్తుగా పని చేయడం ఆగిపోవడం. ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు జరిగిన భారీ కారు ప్రమాదం. వీటన్నింటినీ తలచుకుంటూ, “ఆ ప్రమాదం నుంచి మేం ప్రాణాలతో బయటపడటమే ఒక అదృష్టం. ఇదంతా ‘జిన్’ ప్రభావమే అని మా యూనిట్ నమ్మింది” అని చిన్మయ్ రామ్ వివరించారు. “జిన్ అంటే ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? అన్నది ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని పాయింట్. థియేటర్‌కు వచ్చే సగటు ప్రేక్షకుడు తాను పెట్టే ప్రతి రూపాయికి సరిపడా వినోదాన్ని పొందుతాడని నేను హామీ ఇస్తున్నాను” అని దర్శకుడు భరోసా ఇచ్చారు. అంతేకాకుండా, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇప్పటికే సిద్ధంగా ఉన్న ‘జిన్ 2’ స్క్రిప్ట్‌ను వెంటనే పట్టాలెక్కిస్తానని ఆయన వెల్లడించారు.