Sardar Movie Review: దీపావళి కానుకగా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు మూడు రోజుల ముందే వచ్చేసింది కార్తి నటించిన ‘సర్దార్’ మూవీ. ‘అభిమన్యుడు’ ఫేమ్ పి. ఎస్. మిత్రన్ తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగువారి ముందుకు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ శుక్రవారం తీసుకొచ్చింది. తండ్రీ కొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ‘సర్దార్’ ఎలా ఉందో తెలుసుకుందాం.
విజయ్ ప్రకాశ్ (కార్తి) వైజాగ్ లో పోలీస్ ఇన్ స్పెక్టర్. వృత్తి రీత్యా సాధించే అఛీవ్ మెంట్స్ కంటే కూడా సోషల్ మీడియాలో వాటి ద్వారా లభించే ప్రచారమే అతనికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ప్రచారం పిచ్చిని చూసి అతని ప్రియురాలు, లాయర్ షాలినీ (రాశీఖన్నా) అతనికి దూరంగా ఉంటుంది. ఆమెను ఎలాగో ఒప్పించి పెళ్ళి చేసుకోవాలని విజయ్ భావిస్తుంటాడు. ఇదే సమయంలో ఓ సోషల్ కాజ్ కోసం షాలినీ, ఆమె స్నేహితురాలు సమీర (లైలా) ఓయూ క్యాంపెస్ దగ్గర ధర్నా చేస్తున్న సమయంలో క్యాంపెస్ లోని సీక్రెట్ ఛాంబర్ లోని కీలకమైన ఫైల్ ఒకటి మాయమౌతుంది. దాన్ని దొంగలించింది సమీరా అని తెలియడంతో విజయ్ ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తాడు. అదే రోజు రాత్రి ఆమె శవం ఆర్.కె. బీచ్ లో కనిపిస్తుంది. సమీరా దొంగిలించిన ఫైల్ ఎవరికి చెందింది? ఆమె దాన్ని ఎవరికి అందించడానికి ప్రయత్నించింది? ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? తన తండ్రి సర్దార్ (కార్తి) దేశద్రోహి అని నిరంతరం బాధపడే విజయ్ ప్రకాశ్ కు ఆయన గతం ఎలా తెలిసింది? అన్నదే మిగతా కథ.
దేశ సరిహద్దులలో పోరాడే సైనికులకు ఓ గుర్తింపు ఉంటుంది. దురదృష్టవశాత్తు వారి ప్రాణాలు కోల్పోతే, ప్రభుత్వ గౌరవ మర్యాదలు వారి కుటుంబానికి లభిస్తాయి. కానీ దేశంలోనూ, దేశం కాని దేశంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే గూఢచారులకు మాత్రం ఎలాంటి గుర్తింపు ఉండదు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వం కూడా వారిని ఓన్ చేసుకోదు. అయినా దేశం కోసం గూఢచారులు పని చేస్తూనే ఉంటారు, ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తూనే ఉంటారు. మరి కొందరైతే సంవత్సరాల తరబడి పరాయి దేశాల జైళ్ళలో మగ్గుతుంటారు. అలాంటి ఓ గూఢచారి కథనే పి.ఎస్. మిత్రన్ ఈ సారి ఎన్నుకున్నాడు. అదే ‘సర్దార్’. సరదాగా ఊరిలో నాటకాలు వేసే ఓ వ్యక్తి గూఢచారిగా మారి దేశం కోసం ఏం చేశాడు? బంగ్లాదేశ్ లోని జైలులో మూడు దశాబ్దాల పాటు ఎందుకు ఖైదీగా ఉన్నాడు? తర్వాత తాను మోసపోయిన విషయం తెలిసి, ఎలా స్పందించాడు? అనేదే ఈ కథ.
పి. ఎస్. మిత్రన్ ఈ సినిమా ద్వారా వినోదం మాత్రమే కాదు.. ఓ సామాజికాంశాన్ని ప్రజలకు చెప్పాలని తాపత్రయపడ్డాడు. విద్య, వైద్యం ఎలా అయితే ప్రైవేట్ పరం కాకూడదో.. అలానే తాగే నీరు కూడా ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్ళకూడదని మిత్రన్ గట్టిగా నమ్ముతున్నాడు. భూమి కంటే కూడా నీరు చాలా విలువైందని, దాన్ని కొందరు కుట్రపూరితంగా వ్యాపారంగా మార్చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశాడు. మినరల్ వాటర్ పేరుతో జనం కొంటున్న దానిలో ఎంత ప్యూరిటీ ఉంటుందో తెలియదు వాటినే గుడ్డిగా నమ్మి కోట్లాదిమంది తాగుతున్నారు. తద్వారా వచ్చే అనారోగ్యాల గురించి కూడా మిత్రన్ ఇందులో ఏకరువు పెట్టాడు. ‘వన్ ఇండియా, వన్ పైప్ లైన్’ పేరుతో దేశ వ్యాప్తంగా వాటర్ మాఫియాకు నాంది పలకాలనుకున్న ఓ దుష్టుడికి సర్దార్ ఎలా బుద్ధి చెప్పాడన్నదే ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఇదే సమయంలో కలుషితమైన నీటి విషయంలో మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా దర్శకుడు చెప్పించి ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ విజయ్ ప్రకాశ్ గా, అతని తండ్రి సర్దార్ (బోస్)గా కార్తీ చక్కటి నటన కనబరిచాడు. ముఖ్యంగా అరవై యేళ్ళ సర్దార్ గా అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆ పాత్ర చుట్టూ అల్లిన కథ, అతను జైలు నుండి ఎస్కేప్ అయ్యే సీన్స్, క్లయిమాక్స్ ఫైటింగ్ అన్నీ కూడా మాస్ ను ఆకట్టుకుంటాయి. రాశిఖన్నా లాయర్ పాత్రలో నప్పింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటి రాజీష విజయన్.. సహజ నటన కనబరిచింది. చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన లైలా పోషించిన పాత్ర బాగానే ఉన్నా, సర్దార్ మనుషులకు ఆమె సాయం చేయడానికి మరింత బలమైన కారణాలు చూపించి ఉండాల్సింది. లైలా కొడుకుగా మాస్టర్ రిత్విక్ చక్కగా నటించాడు. ఇటీవల ‘లైగర్’లో కనిపించిన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే.. ఇందులో పూర్తి స్థాయి విలన్ గా చేశాడు. ఇతర ప్రధాన పాత్రలను అవినాశ్, మునీశ్ కాంత్, యుగి సేతు, ఇలవరసు తదితరులు పోషించారు. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం, జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. రాకేందు మౌళి సంభాషణలు చక్కగా ఉన్నాయి. అయితే, అనేక చోట్ల తమిళ పేర్లనే యథాతథంగా ఉంచేయడం బాధాకారం. కార్తి అభిమానుల సంగతి చెప్పక్కర్లేదు, థ్రిల్లర్ అండ్ యాక్షన్ జానర్ మూవీస్ ను ఇష్టపడే వారికీ ‘సర్దార్’ తప్పక నచ్చుతుంది.
రేటింగ్: 2.75/ 5
ప్లస్ పాయింట్స్
కార్తీ నటన
ఆసక్తి కలిగించే కథ
దర్శకత్వ ప్రతిభ
మైనెస్ పాయింట్స్
మూవీ రన్ టైమ్
లెంగ్తీగా ఉన్న కొన్ని సీన్స్
ట్యాగ్ లైన్: వాటర్ మాఫియా!