Crime News : మోసాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. రోజుకొక కొత్త రూపంలో మోసాలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నమ్మిన వ్యక్తులే ఊహించని రీతిలో మోసం చేస్తున్నారు. తాజాగా మిర్యాలగూడలో అటవీశాఖ ఉద్యోగిని మోసం చేసిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్ బెయిల్ చేసి ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు ఓ వ్యక్తి. గతంలో విశ్రాంత ఉద్యోగి త్రిపురాం మండలం రాగడప బీట్ అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేవాడు. తిరుమలగిరి మండలం గట్టుమీద తండాకు చెందిన ఆంగోత్ గణేశ్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లను దొంగతనం చేస్తూ జల్సాలు చేసేవాడు. ఆ విషయం విశ్రాంత ఉద్యోగికి తెలియక అతనితో పరిచయం పెంచుకున్నాడు.
Read Also : Kollu Ravindra: బందరు నిండా బడ్డీ కొట్లు పెట్టించి.. మేం తొలగిస్తే విమర్శలా..?
గణేశ్ మంచి టైమ్ కోసం వెయిట్ చేసి.. ఓ రోజు విశ్రాంత ఉద్యోగికి పీకల దాకా మందు తాగించాడు. ఓ మహిళకు డబ్బులు ఇచ్చి విశ్రాంత ఉద్యోగితో రకరకాల అసభ్యకర భంగిమల్లో ఉంచి ఫొటోలు తీసుకున్నాడు. వాటిని చూపించి మీ ఫ్యామిలీకి చూపిస్తానంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజటం స్టార్ట్ చేశాడు. వేల నుంచి లక్షలు వసూలు చేశాడు. ముందు జాగ్రత్తతో డబ్బులు వడ్డీకి తీసుకున్నట్టుగా 19 ప్రామిసరీ నోట్ల మీద అధికారి సంతకాలు తీసుకొని తన వద్ద ఉంచుకున్నాడు.
ఓ రోజు వాటిని చూపించి అధికారి కూతురు, అల్లుడి వద్ద ఏకంగా రూ.46లక్షలు వసూలు చేశాడు. ఈ విషయంలో గణేశ్ కు అతని భార్య సహకరించింది. రీసెంట్ గా మరో రూ.3లక్షలు కావాలని ఇద్దరూ కలిసి వేధించారు. ఇక తన వల్ల కాదని ఆ విశ్రాంత ఉద్యోగి ఇంట్లో జరిగిందంతా చెప్పాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14లక్షల విలువైన కారుతో పాటు ప్రామిసరీనోట్లు, నాలుగున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.