K Ramp Review: కిరణ్ అబ్బవరం హీరోగా ‘క’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన అనౌన్స్ చేసిన ‘కే ర్యాంప్’ అనే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాని జైన్స్ నాని అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. రాజేష్ దండ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.
కథ:
కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) చదువుల్లో బాగా వెనకబడి ఉంటాడు. ఎంసెట్ రాసినా ర్యాంక్ రాకపోవడంతో, అతని ధనిక తండ్రి (సాయికుమార్) డొనేషన్ కట్టి కేరళలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత, ఒక ప్రమాదం నుండి అతన్ని అదే కాలేజీలో చదువుతున్న మెర్సీ జాయ్ (యుక్తి తరేజా) కాపాడుతుంది. దీంతో ఆమెతో ప్రేమలో పడతాడు కుమార్. ముందు ఆమె ఒప్పుకోకపోయినా, తర్వాత ఆమె కూడా ప్రేమలో పడుతుంది. అయితే, ఆమెకు ఒక మానసిక రుగ్మత ఉందనే విషయం కుమార్కు తెలుస్తుంది. ఈ మానసిక రుగ్మత కారణంగా కుమార్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ఆ మానసిక రుగ్మతతో హీరోయిన్ ఏం చేసింది? అనే విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది కేవలం నవ్వుకునేందుకు చేసిన సినిమా అని, లాజిక్స్ వెతుకుతూ సినిమా చూస్తే పెద్దగా ఏమీ ఉండవని ముందే సినిమా టీమ్ ప్రకటించేసింది. అందుకు తగ్గట్టుగానే సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్. బాగా డబ్బులు ఉన్న తండ్రి అన్నిటికీ ఎదురు చెప్పకుండా కోరికలు తీర్చుతూ వెళ్లడంతో దారితప్పిన ఓ కొడుకు కథ ఈ సినిమా. అలాగే, ఏదైనా ఒక అవలక్షణం చుట్టూ అల్లుకున్న కథలు తెలుగులో ఇప్పటికే చాలా ఉన్నాయి. మతిమరుపుతో నాని ‘భలే భలే మగాడివోయ్’, అతి శుభ్రతతో శర్వానంద్ ‘మహానుభావుడు’ వంటి సినిమాలు వచ్చాయి. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. తెలుగులో ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అదే ఫార్మాట్‌తో ఈ సినిమా కథ కూడా రాసుకున్నారు. తమ తల్లిదండ్రులు కారణంగా ఒక రుగ్మతకు లోనైన హీరోయిన్తో ప్రేమలో పడ్డ హీరో, ఆ హీరోయిన్ ఆ రుగ్మతను మాన్పించి తిరిగి మామూలు మనిషిగా ఎలా చేశాడు అన్న లైన్‌తో ఈ కథ రాసుకున్నారు.
అయితే, పెద్దగా వేరే విషయాలు జోలికి వెళ్లకుండా, ఆ రుగ్మత చుట్టూనే కామెడీ రాసుకున్నారు. ఆ రుగ్మతకు సొల్యూషన్ కూడా హీరో మానసిక పరివర్తనతోనే రాసుకోవడం రొటీన్ అనిపించినా, కిరణ్ అబ్బవరం స్టైల్ డైలాగ్స్ థియేటర్లో కొన్ని వర్కౌట్ అయ్యాయి. సినిమాని పెద్దగా ఆలోచించకుండా సరదాగా ఓసారి చూసేందుకు అన్నట్టుగానే క్రియేట్ చేశారు. అదే విషయాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. వారు చెప్పిన దానికి ఎక్కువ అవలేదు, అలా అని తక్కువ అవలేదు.
సినిమా మొదలైన 15 నిమిషాలకు కథ కేరళలోని ఇంజనీరింగ్ కాలేజీకి షిఫ్ట్ అవుతుంది. ఇక ఆ తర్వాత త్వరత్వరగానే హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఆమె కూడా హీరోతో ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు బాగుంటాయి. ఇక హీరోయిన్‌కు ఉన్న రుగ్మత బయటపడిన తరువాత హీరో పడే పాట్లు, పడే టెన్షన్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా రాసుకున్నారు. అది చాలా వరకు వర్కౌట్ అయింది. అయితే, అక్కడక్కడ కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి కానీ, పూర్తి సినిమాగా అంటే లాజిక్‌లెస్ అని చెప్పాలి. కేవలం కామెడీ బేస్డ్ సినిమా అనే చెప్పొచ్చు. అవి కూడా అక్కడక్కడ మాత్రమే వర్కౌట్ అయ్యాయి.
నటీనటులు:
ఇక నటుల విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం తనకు బాగా అలవాటైన తరహా పాత్రలోనే కనిపించాడు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్‌గా, ‘రిచెస్ట్ చిల్లర ఫెలో’గా అత్యంత నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఇక సాయికుమార్ పాత్ర పరిమితమైనా, సినిమా మొత్తానికి చాలా కీలకమైనది. అదేవిధంగా నరేష్ కనిపించినంతసేపు నవ్వించాడు. యుక్తి తరేజాకి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికినా, ఎందుకో దాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేదేమో అనిపించింది. మరోపక్క, ఆమె పెదనాన్న పాత్రలో నటించిన మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్, అలీ, శ్రీనివాసరెడ్డి వంటి వాళ్లు కనిపించిన ప్రతిసారి నవ్వించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ టీం:
ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే, వన్ లైనర్స్ బాగా రాసుకున్నారు. కామెడీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పూర్తిస్థాయిలో హాస్యమే ప్రధానంగా సినిమా మొత్తం నడిపించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకా కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. పాటలు కొన్ని బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది.
ఫైనల్లీ ఈ కే ర్యాంప్... నో లాజిక్స్… జస్ట్ సిట్యువేషనల్ కామెడీ విత్ అడల్ట్ జోక్స్.