NTV Telugu Site icon

Raju Yadav Review: గెటప్ శ్రీను ‘రాజు యాదవ్’ రివ్యూ.. ఎలా ఉందంటే?

Rajuyadav16

Rajuyadav16

Getup Srinu’s Raju Yadav Review: జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న వారిలో గెటప్ శ్రీను కూడా ఒకరు. వినూత్నమైన గెటప్స్ వేస్తూ దాన్నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన హీరోగా నటించిన చిత్రం రాజు యాదవ్. నిజానికి గెటప్ శ్రీను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి సినిమాల్లో మంచి పాత్రలలో మెరిశారు. అలాంటి ఆయన తన స్నేహితులతో కలిసి త్రీ మంకీస్ అనే సినిమాలో కూడా నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు. అలాంటి ఆయన సోలో హీరోగా రాజు యాదవ్ అనే సినిమా తెరకెక్కింది. వేణు ఉడుగుల శిష్యుడు కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

కథ ఏమిటంటే:
రాజు యాదవ్ (గెటప్ శ్రీను)ది మహబూబ్ నగర్. తండ్రి (ఆనంద చక్రపాణి) డ్రైవర్ అయినా సరే ఒక సగటు మిడిల్ క్లాస్ తండ్రి కావడంతో కొడుకు గవర్నమెంట్ జాబ్ కొడతాడని కష్టపడి చదివించినా డిగ్రీలో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు రాజు. దీంతో అవ్వడంతో ఖాళీగా తిరుగుతూ సమయం గడిపేస్తూ ఉంటాడు. క్రికెట్ ఆడేటప్పుడు ముఖానికి కార్క్ బాల్ తగలడంతో ఆర్ఎంపీ డాక్టర్ తెలిసి తెలియకుండా కుట్లు వేయడంతో ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉండిపోయేలా ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. అలా కాలం గడుపుతున్న సమయంలో తన స్నేహితుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని పోలీస్ స్టేషనుకు వెళితే స్వీటీ (అంకితా కరాట్) కనిపిస్తుంది. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. మా వెంట పడవద్దు అని ఆమె చెబుతున్నా సరే స్వీటీకి హైదరాబాదులో ఉద్యోగం వస్తే రాజు యాదవ్ కూడా సిటీకి షిఫ్ట్ అవుతాడు. ఆమె బర్త్ డేకి ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసి తనకు ముందే బాయ్ ప్రెండ్ ఉన్నాడని చెబుతుంది. ఆ తర్వాత ఏమైంది? రాజు యాదవ్ దుబాయ్ వెళ్లాలని ఎందుకు అనుకున్నాడు? తండ్రితో డబ్బుల కోసం ఎందుకు గొడవ పడ్డాడు? స్వీటీ ప్రేమ రాజు యాదవ్ కు దక్కిందా? చివరకు ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఈమధ్య దర్శకులు రీసెర్చ్ చేసి మరి అరుదైన లోపాలు ఏమున్నాయో తెలుసుకుని ఆ లోపాల చుట్టూ కథ రాసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ముఖానికి క్రికెట్ బాల్ తగలడం, కుట్లు వేశాక / సర్జరీ తర్వాత ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్టు ఉండటం అనే కాన్సెప్ట్ అలాగే అనిపిస్తుంది. అయితే కథలో ఇదొక్కటే కొత్త పాయింట్ కానీ మిగతాదంతా మనం ఎప్పటినుంచో చూస్తున్న సినిమాల లాగానే అనిపిస్తుంది. కొన్ని ఐడియాలు విన్నప్పుడు బావుంటాయి కానీ, కథలు రాసేటప్పుడు ఎక్కడో లైన్ తప్పుతాయి. ఫుల్ లెంత్ స్క్రిప్ట్ అయ్యాక రెండు గంటలు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టగల బలం ఉంటే హిట్టు లేదంటే యావరేజ్ సినిమాగా ప్రేక్షకులు డిసైడ్ చేసేస్తారు. ‘రాజు యాదవ్’ కాన్సెప్ట్ పరంగా ఓకే. కానీ, ఆ కథలో బలమైన సన్నివేశాలు లేవు. ఈ తరహా ప్రేమ కథలు తెరపై ప్రేక్షకులు ఎన్నో సార్లు చేశారు. ‘ఆర్ఎక్స్ 100’, ‘బేబీ’లో హీరోయిన్ పాత్రలకు, ‘రాజు యాదవ్’లో హీరోయిన్ పాత్రకు ఉన్న పోలికలు ఆసక్తికరం. ఆ ప్రేమ కథ ముగిశాక వచ్చిన సన్నివేశాలు గుండెలను బరువెక్కించేలా తెరకెక్కించడంలో యూనిట్ సక్సెస్ అయింది. అయితే సినిమా యూనిట్ ముందు నుంచి చెబుతున్నట్టుగా ‘రాజు యాదవ్’లో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం గానీ, ఆవారాగా తిరిగే హీరో క్యారెక్టర్ గానీ, ఆ ప్రేమ కథకు ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించలేదు. క్లైమాక్స్ సన్నివేశాల్లో బరువైన భావోద్వేగాలు చూపించారు. అమ్మాయి ప్రేమలో పడితే మూడు లక్షలు తీసుకుని సర్జరీ చేయించుకోవాలని అనుకునే హీరో, ఆమెను సిన్సియర్ గా ఎప్పుడు ప్రేమించాడనే పాయింట్ కన్వే చేసి ఉంటే బాగుండేది. సినిమాలో ఎంచుకున్న యూనిక్ కాన్సెప్ట్ వల్ల కొన్ని కామెడీ సీన్లు పర్వాలేదు అనిపించాయి.

నటీనటుల విషయానికి వస్తే:
రాజు యాదవ్ పాత్రకు గెటప్ శ్రీను హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేం అనేంతలా నటించాడు. నోరు తెరిచి ఉండాల్సిన సన్నివేశాల్లో నటన అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. హీరోయిన్ అంకిత ఖరత్ పాత్రకు తగ్గట్టు నటించింది. హీరో తండ్రిగా ఆనంద చక్రపాణికి మంచి రోల్ పడింది. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన కంటతడి పెట్టిస్తుంది. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన పాటలు బావున్నాయి. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ విషయంలో మరింత కేర్ తీసుకుంటే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

ఫైనల్లీ:
రాజు యాదవ్ లో గెటప్ శ్రీను నటన కోసం వెళ్లాలని అనుకుంటే ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్లండి.