Dollar vs Rupee: భారతీయ రూపాయి నేడు అమెరికా డాలర్‌తో పోలిస్తే 9 పైసలు క్షీణించి.. అల్ టైం కనిష్ఠానికి రూపాయి విలువ 90.41 వద్ద ముగిసింది. ఇందుకు ప్రధాన కారణం భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, పెద్ద మొత్తంలో విదేశీ నిధుల ఉపసంహరణ పెట్టుబడిదారులపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఫారెక్స్ ట్రేడర్ల ప్రకారం.. గ్లోబల్ లో మెటల్ ధరలు భారీగా పెరుగుతుండడంతో దిగుమతిదారులు డాలర్ కొనుగోళ్లను దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూపాయిపై ఒత్తిడి మరింత పెరిగింది.
Union Cabinet Decisions: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర క్యాబినెట్..
దీనితో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో రూపాయి 90.43 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి, తరువాత 90.56 వరకు పడిపోయింది. ఇది గత ముగింపుతో పోలిస్తే 24 పైసల పతనాన్ని సూచిస్తుంది. రోజంతా ఒడిదుడుకుల అనంతరం చివరకు 90.41 వద్ద ముగిసింది. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం ఆలస్యం రూపాయికి ప్రతికూల సంకేతంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. రెండు దేశాలు గురువారం ముగిసిన ద్వైపాక్షిక వాణిజ్య చర్చల్లో పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాయి. త్వరలో అంగీకారానికి రాబోతున్న ట్రేడ్ డీల్‌పై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. తాజగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు కూడా.