ఏపీలో నేడు వైసీపీ ర్యాలీలు.. కేంద్ర కార్యాలయానికి చేరనున్న కోటి సంతకాలు..
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతోంది. ర్యాలీ తర్వాత అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులను పంపిస్తారు. వాటిని ఈనెల 18న గవర్నర్‌కి అందజేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను నిలిపేయాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్‌ని కోరనున్నారు. అక్టోబర్ 10న ప్రారంభమైన రచ్చబండ కార్యక్రమంలో కోటి సంతకాలను సేకరించిన విషయం విదితమే. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం)లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకోగా.. ఈ చర్య పూర్తిగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడమే అని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే.. అక్టోబర్ 10న ప్రారంభమైన ‘రచ్చబండ’ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించినట్లు పార్టీ నేతలు తెలిపారు. మెడికల్ విద్య సామాన్యులకు దూరమవుతుందనే ఆందోళనతోనే ఈ ఉద్యమాన్ని చేపట్టినట్లు వైసీపీ స్పష్టం చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం మరింత ఉధృతం కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మరోసారి ఢిల్లీకి మంత్రి నారా లోకేష్.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తినబాట పట్టారు.. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. కొంతమంది కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించనున్నారు. అమరావతి చట్టబద్ధతకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్‌లతో భేటీకానున్నారు.. విద్య, ఐటీ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీలోనే ఉండి.. రేపు అక్కడి నుంచి నేరుగా విశాఖకు రానున్నారు మంత్రి నారా లోకేష్. విశాఖలో GMR ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రారంభంలో పాల్గొనున్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు మార్లు ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ.. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం.. నిధులు రాబట్టడం కోసం ప్రయత్నాలు చేస్తోన్న విషయం విదితమే..
వైసీపీ విమర్శలకు కూటమి నుంచి కౌంటర్ కరువు..! సీఎం ఎన్నిసార్లు చెప్పినా మారని తీరు..!
కూటమి ప్రభుత్వం అడ్డూఅదుపు లేకుండా అప్పులు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. విజన్ అంటే అప్పులు చేయడమేనా అని నిలదీస్తున్నారు వైసీపీ నేతలు. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాండ్స్ అమ్మి 5750 కోట్ల అప్పు తీసుకోబోతున్నారని చెప్పారు. సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం అప్పులు తీసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేనలు తప్పుడు ప్రచారం చేశాయని మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు 7లక్షల 21వేల 918 కోట్లు అని కూటమి ప్రభుత్వం తేల్చిందన్నారు. అందులో 3,90,247 కోట్లు అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య చేసిన అప్పు అన్నారాయన. అంటే తమ ప్రభుత్వం చేసిన అప్పు 3 లక్షల కోట్ల చిల్లర మాత్రమేనన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఆరు నెలలలోనే ఏకంగా రూ.లక్షా12వేల 750 కోట్ల అప్పులతో రికార్డులకెక్కిందని విమర్శించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇంత పెద్ద ఫ్రాడ్ చూడలేదన్నారు. తెచ్చిన అప్పు మీద శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 40ఏళ్ల చరిత్ర, 70 ఏళ్లకు పైగా వయసున్న చంద్రబాబు ఎందుకు ఫ్రాడ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు… ప్రశ్నించడం మానేసి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారన్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. సంపద సృష్టిస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. 18 నెలల్లో 2 లక్షల 66 వేల కోట్లు అప్పులు కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. కానీ దేనికెంత ఖర్చు చేశారో పాలకులు, అధికారులు చెప్పట్లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ మరో శ్రీలంక, బంగ్లాదేశ్‌లో మారిపోతుందని ప్రచారం చేసిన చంద్రబాబు, పవన్…ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు బొత్స సత్యనారాయణ. ఆరోగ్యాంధ్రను అప్పుల ఆంధ్రాగా మార్చేశారంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతున్నా… ప్రభుత్వం నుంచి, అధికారంలో ఉన్న పార్టీల నుంచి ప్రతిస్పందన కరువైంది. మంత్రులు ఏమీ పట్టనట్టు ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలక అంశాలపై వైసీపీ విమర్శలు చేస్తుంటే తమకేమీ పట్టనట్టు కూటమి నేతల తీరు ఉంది. కనీసం ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిలో కూడా కూటమి నేతలు లేరు. ముఖ్యమంత్రి ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల పనితీరులో మార్పు రావడం లేదు. అన్నింటికీ సీఎం వచ్చి సమాధానాలు చెప్పాలా..? ప్రభుత్వంపై ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంటే… మంత్రులు చూస్తూ కూర్చుంటున్నారు. కనీసం కౌంటర్ ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారనే చర్చ జరుగుతోంది.
పంచాయతీ పోరులో కాంగ్రెస్ హవా.. రెండో విడతలోనూ అదే జోరు
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదివారం నాడు జరిగిన మలి విడత ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. మలి విడతలో 192 మండలాల పరిధిలోని 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.. 2,112కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మెజారిటీ సీట్లను సాధించడంతో గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ తన పట్టును నిలుపుకుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ కూడా మలి విడత ఫలితాలు కాస్త ఊరట ఇచ్చాయి. 1, 026కు (25 శాతానికి) పైగా సీట్లలో గెలవడంతో గ్రామాల్లో తన ఉనికిని చాటుకుంది. ఇక, బీజేపీకి రెండో విడతలో 225 మంది అభ్యర్థులు గెలిచారు. కమ్యూనిస్టులు, ఇతర పార్టీలూ 10 శాతానికి పైగా సీట్లను దక్కించుకున్నాయి. అయితే, మలి విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 415 స్థానాలు ఏకగ్రీవం అవగా.. ఐదు గ్రామాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు.. మిగిలిన 3,911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 2,112 స్థానాలను గెలుచుకున్నారు. మలి విడతలో విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ రెబల్సే ఉండడం గమనార్హం. కాగా, సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ మినహా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్ సహా 20 జిల్లాల్లో సగానికి పైగా ఎక్కువ సీట్లను కాంగ్రెస్ గెలిచింది. అయితే, ఏకగ్రీవమైన 415 గ్రామ పంచాయతీల్లో 90 శాతానికి పైగా కాంగ్రెస్ పార్టీనే ఉండటం విశేషం.
సర్పంచ్గా మామపై గెలిచిన కోడలు.. ఎన్ని ఓట్ల తేడానో తెలుసా..?
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మామపై కోడలు పోటీ చేసి విజయం సాధించింది. కాగా, శ్రీరామ్‌నగర్ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో రాధిక 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అయితే, కుటుంబ విభేదాల కారణంగా గత కొంతకాలంగా మామ- కొడుడు వేర్వేరుగా ఉంటున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సత్యనారాయణ గౌడ్ పోటీ చేయగా, బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల సపోర్టుతో రాధిక బరిలోకి దిగారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన పోరులో చివరికి రాధిక స్వల్ప మెజారిటీతో గెలిచి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించింది. కుటుంబ రాజకీయాల నడుమ జరిగిన ఈ ఎన్నిక ఫలితం గ్రామంలో విస్తృత చర్చకు దారితీసింది. రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే కాకుండా, కుటుంబ విభేదాలు కూడా ఎన్నికల ఫలితంపై తీవ్ర ప్రభావం చూపినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు .. ఏకమైన మెయిటీ-కుకి బీజేపీ ఎమ్మెల్యేలు
మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి, 2026 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోసారి కొనసాగించాలంటే పార్లమెంట్ లేదా ఎన్నికల సంఘం ఆమోదం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెయిటీ, కుకి బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ పెద్దలతో ఎమ్మె్ల్యేలంతా సమావేశమై ఐక్యతను చాటుకున్నారు. 2023, మే నెల తర్వాత ఇలా ఐక్యంగా కలవడం ఇదే తొలిసారి. మణిపూర్‌లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్‌తో కుకి, మెయిటీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఒక్కటయ్యారు. సమావేశం ఫలవంతమైందని బీఎల్.సంతోష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. మణిపూర్‌లో శాంతి, అభివృద్ధి గురించి చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైకి వచ్చారని స్పష్టం చేశారు. మొత్తానికి మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది. ఈ సందేశాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేశారు. ఇదిలా ఉంటే గత వారం రాష్ట్రపతి మణిపూర్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే కుకి, మెయిటీ నేతలంతా కలిసి చర్చించారు. తాజాగా ఇరు వర్గాల ఎమ్మెల్యేలంతా ఐక్యతను చాటారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
నేటి నుంచి 3 విదేశాల్లో మోడీ పర్యటన.. వాణిజ్య ఒప్పందాలపై దృష్టి
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 18 వరకు మూడు విదేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్‌లో భాగంగా పర్యటన కొనసాగుతోంది. ఈ మూడు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనుంది. ద్వైపాక్షిక సంబంధాలతో దేశాలతో భారత్ సంబంధాలు బలపడనున్నాయి. గత నెల నవంబర్ 21, 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్‌కు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సమ్మిట్‌కు ట్రంప్ గైర్హాజరయ్యారు. సౌతాఫ్రికాలో శ్వేత జాతి రైతులపై దాడులు నిరసిస్తూ ట్రంప్ నిరసన వ్యక్తం చేశారు.
నరాలు తెగే ఉత్కంఠ.. మధ్యప్రదేశ్‌పై ఒక్క పరుగు తేడాతో ఝార్ఖండ్ గెలుపు..!
పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్ గ్రూప్-A మ్యాచ్‌లో ఝార్ఖండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో మధ్యప్రదేశ్‌ను కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించింది. మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగగ.. యువ ఫాస్ట్ బౌలర్ సుశాంత్ మిశ్రా కీలక చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టుకు గుర్తుండిపోయే విజయం అందించాడు. ఈ గెలుపుతో ఝార్ఖండ్ టోర్నీలో వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకు ఝార్ఖండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవకవడం గమనార్హం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఝార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన జట్టు.. ఇషాన్ కిషన్ కేవలం 30 బంతుల్లో 63 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా అనుకుల్ రాయ్ 29 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు 20 పరుగుల మార్క్‌ను దాటలేకపోయారు. దీనితో జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో మధ్యప్రదేశ్ కు మంచి ఆరంభం లభించింది. హర్ష్ గావ్లీ 49 బంతుల్లో 61 పరుగులు చేయగా, హర్ప్రీత్ సింగ్ భాటియా అజేయంగా 48 బంతుల్లో 77 పరుగులు సాధించి చివరి వరకు పోరాడాడు. ఇక చివరి 6 బంతుల్లో మధ్యప్రదేశ్ విజయం కోసం 13 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ బాధ్యత తీసుకున్న సుశాంత్ మిశ్రా ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఓవర్ తొలి బంతికి రజత్ పాటీదార్ ఫోర్ కొట్టినా, ఆ తర్వాత మిశ్రా మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఒక వైడ్, ఒక నో బాల్ వేసినా కీలక సమయంలో పాటీదార్ వికెట్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి బంతికి 3 పరుగులు అవసరమైన సమయంలో అద్భుత యార్కర్‌తో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఝార్ఖండ్‌కు సంచలన విజయాన్ని అందించాడు. ఇందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ఉత్కంఠ పోరులో ఆంధ్ర జట్టు సంచలన విజయం.. మరోసారి నిరాశపరిచిన నితీష్ రెడ్డి..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్-A మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు పంజాబ్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం (డిసెంబర్ 14) పూణే వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో ఆంధ్ర 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆంధ్రకు మారంరెడ్డి హేమంత్ రెడ్డి అసాధారణ ఇన్నింగ్స్‌తో తొలి విజయాన్ని అందించాడు. కేవలం తన రెండవ SMAT మ్యాచ్ ఆడుతున్న 23 ఏళ్ల హేమంత్ రెడ్డి అజేయంగా 109 పరుగులు (53 బంతుల్లో, 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేసి జట్టును గెలిపించాడు. చివరి బంతి మిగిలి ఉండగానే ఆంధ్ర 211/5 పరుగులు చేసి ఛేదనను పూర్తి చేసింది. భారీ ఛేజింగ్‌లో ఆంధ్ర జట్టుకు పేలవమైన ఆరంభం లభించింది. పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ (3/23) ధాటికి ఓపెనర్లు శ్రీకర్ భరత్ (1), అశ్విన్ హెబ్బార్ (4) తొలి ఓవర్‌లోనే ఔటయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ రికీ భూయ్ (15), నితీష్ కుమార్ రెడ్డి (0) కూడా విఫలమయ్యారు. దీనితో 9వ ఓవర్ నాటికే ఆంధ్ర 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పరాజయం దిశగా సాగింది. ఇక ఓటమి ఖాయమనుకున్న దశలో క్రీజులోకి వచ్చిన ఎస్‌డిఎన్‌వి ప్రసాద్ తో కలిసి హేమంత్ రెడ్డి చెలరేగి ఆడాడు. ఆరో వికెట్‌కు ఈ జోడి ఏకంగా 155 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ప్రసాద్ 35 బంతుల్లో 53 పరుగులు చేసి హేమంత్‌కు అద్భుత సహకారం అందించాడు. వీరిద్దరూ పంజాబ్ బౌలర్లపై విరుచుకపడ్డారు. చివరకు జట్టును గెలిపించారు. సెంచరీతో అదరగొట్టిన హేమంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
నన్ను చూసుకునే నాకు పొగరు, నా వృత్తి నా దైవం : నందమూరి బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఒక పని కోసం కొందరిని ఆ పరమశివుడే ఎంచుకుంటాడు. ఈ సినిమా విడుదలై ఇంత అద్భుతంగా విజయవంతంగా ప్రదర్శించబడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో ఆ ఉద్దేశాన్ని మీరు పాటించాలి. మనిషి పుట్టుకకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు సనాతన హైందవ ధర్మం మీసం మేలేసిందని చెప్తున్నారు. మన ధర్మం మన గర్వం మన తేజస్సు కలగలిపిన సినిమా ఆపాల గోపాలం అలరించిందని యావత్ ప్రపంచం చెబుతోంది. ఈ సినిమాలో ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఆణిముత్యం. ప్రతి సన్నివేశం ఒక ఉద్వేగం ప్రకంపనం. ఈ రోజుల్లో ప్రజలు సినిమాని కూడా ఒక నిత్యవసర వస్తువుగా ఎంచుకున్నారు. అలాంటప్పుడు మనం ఎటువంటి సినిమాలు తీయాలని కూడా ఆలోచించుకోవాలి. వరుసగా ఐదు సినిమాలు విజయం సాధించడం నాకు చాలా గర్వంగా ఉంది. రేపు రాబోతున్న సినిమా కూడా అద్భుతమైన చరిత్ర సృష్టించబోతుంది. చరిత్రలో చాలా మంది ఉంటారు. సృష్టించిన చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాసి తిరిగి చరిత్ర సృష్టించే వాడు ఒక్కడే. అది ఒక తెలియని శక్తి. ‘ఎవరిని చూసుకుని రా బాలకృష్ణకు అంత పొగరు’ అని చాలా మంది అంటారు. నన్ను చూసుకునే నాకు పదునైన పొగరు. నా వ్యక్తిత్వమే నన్ను ఉసిగొలిపే విప్లవం. నన్ను నేను తెలుసుకోవడమే. నా వృత్తి నా దైవం. ఆ వృత్తే అఖండ సినిమాలో నా పాత్ర. పాత్ర చేయడం అంటే ఒక పరకాయ ప్రవేశం. అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి సాధ్యపడింది. నాకు ధన్యమైన జన్మ ఇచ్చి మీరందరి గుండెల్లో ప్రతిరూపంగా నిలిపినందుకు మాతండ్రి గారికి పాదాభివందనాలు. ఈ సినిమాకి ఇంత అద్భుతమైన విజయాన్ని ఇచిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు’ అని అన్నారు.
సూర్య అభిమానులకు గుడ్ న్యూస్..
కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఎప్పుడూ అలరించే స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుసబెట్టి ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ స్పీడులో సూర్య తన 46వ సినిమా (వర్కింగ్ టైటిల్: సూర్య 46)ను తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ ఒక పక్కా ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. వెంకీ అట్లూరి గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే, ఈసారి కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉంటాయని అర్థమవుతోంది. షూటింగ్ పూర్తవడంతో, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమాతో దర్శకుడు వెంకీ అట్లూరి తన సక్సెస్ ట్రాక్‌ని కంటిన్యూ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ముఖ్యంగా, తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను సూర్య మార్కెట్‌కి తగ్గట్టుగా బ్యాలెన్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి జోడీ చూడటానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుందని టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌తో పాటు మిగతా కీలక అప్‌డేట్స్ అన్నీ మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.