NTV Telugu Site icon

Geethanjali Malli Vachindi Movie Review: గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ

Ggg

Ggg

సుమారు 10 ఏళ్ల క్రితం అంజలి హీరోయిన్గా వచ్చిన హారర్ కామెడీ గీతాంజలి మూవీ మంచి హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది పేరుతో ఒక సినిమా రూపొందించారు. గీతాంజలి సినిమా నిర్మాతగా వ్యవహరించిన ఎంవివి సత్యనారాయణ మరో సారి ఈ సినిమాని నిర్మించగా గీతాంజలి సినిమాకి కథ అందించిన కోన వెంకట మరోసారి గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకి కథ స్క్రీన్ ప్లే అందించారు. అయితే గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకి కొత్త దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. అంజలి 50వ సినిమాగా పెద్ద ఎత్తున ముందునుంచే సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కథ:
ఈ సినిమా గీతాంజలి సినిమాకి కొనసాగింపుగానే తెరకెక్కించారు. గీతాంజలి సినిమా చివరిలో రావు రమేష్ ను చంపేసిన తర్వాత శ్రీను(శ్రీనివాసరెడ్డి) ఆరుద్ర, ఆత్రేయ (సత్యం రాజేష్, షకలక శంకర్) మరో రెండు మూడు సినిమాలు చేస్తారు. కానీ అవి దారుణమైన డిజాస్టర్ గా నిలుస్తాయి. హైదరాబాదులో ఖర్చుల కోసం విశాఖపట్నంకి చెందిన అయాన్ (సత్య)ను హీరోని చేస్తామని నమ్మబలికి అతని డబ్బుతోనే కాలం గడుపుతూ ఉంటారు. అనుకోకుండా అయాన్ హైదరాబాద్ రావడంతో వీరి బండారం బయటపడుతుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మల్టీ మిలియనీర్ విష్ణు హారర్ కామెడీ జోనర్ లో సినిమా చేయాలని ఊటీలో కథా చర్చల కోసం రమ్మని వీరిని ఆహ్వానిస్తాడు. సరిగ్గా అదే ఊటీలో అంజలి(అంజలి) కూడా ఒక కాఫీ షాప్ నడుపుతూ ఉంటుంది. సంగీత మహల్ అనే ఒక మహల్ లో సినిమా షూటింగ్ చేయాలని , సినిమాలో అంజలిని హీరోయిన్గా తీసుకురావాలని విష్ణు శ్రీను అండ్ బ్యాచ్ కి పురమాయిస్తాడు. అప్పటికే బూతు బంగ్లాగా పేరు పొందిన సంగీత మహల్ కి సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లిన ఈ టీమ్ అంతా అక్కడి దెయ్యాలతో ఎలా ఇబ్బందులు పడింది? చనిపోయిన రావు రమేష్ ఆత్మ ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చింది? రావు రమేష్ చనిపోయిన తర్వాత శాంతించింది అనుకున్న గీతాంజలి ఆత్మ మరోసారి ఎందుకు తిరిగి వచ్చింది? చివరికి అసలు ఏమైంది అనేది ఈ గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కథ.

విశ్లేషణ:
హారర్ కామెడీ అనేది తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన జానర్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇదే జానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేసిన చరిత్ర వారిది. గీతాంజలి సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచనతో మేకర్స్ ఒక ఆసక్తికరమైన ప్రయోగం చేశారు. నిజానికి ఈ మధ్యకాలంలో వస్తున్న సీక్వెల్స్ చాలా వరకు మొదటి భాగానికి రెండో భాగానికి సంబంధం లేకుండా చేస్తున్నారు కానీ ఈ సినిమా విషయంలో మాత్రం మొదటి భాగానికి రెండో భాగాన్ని లింక్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు. సినిమా ఓపెన్ చేసిన తర్వాత కథలోకి తీసుకువెళ్లేందుకు కాస్త సమయం పడుతుంది. కానీ ఎప్పుడైతే హైదరాబాదు నుంచి ఊటీకి సినిమా షిఫ్ట్ అవుతుందో అప్పటినుంచి సినిమాలో ఒక ఊపు కనిపిస్తుంది. సినిమా అవకాశం కోసం మొఖం వాచిపోయి ఉన్న ఒక బ్యాచ్ మొత్తాన్ని ఊటీకి తీసుకొచ్చి వారి చేత సినిమా చేయించడం ఏమిటి అని అనుమానం కలిగే లోపే అసలు ఆ సినిమా చేయించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని బయట పెట్టడం ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. నిజానికి ఈ సినిమాలో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అయ్యాయి ఏమో అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ రాసుకున్న సీన్స్ తో అంత ఆలోచన కూడా రాకుండా కడుపుబ్బ నవ్వించేశారు మేకర్స్. లాజిక్స్ గురించి ఆలోచించే లోపే కామెడీతో మ్యాజిక్ చేశారు అనుకోవచ్చు.. ఒక్కోసారి క్రింజ్ అనిపించే లోపు మళ్లీ తమదైన వన్ లైనర్స్ తో నవ్వించారు. సినిమా మొత్తాన్ని కామెడీ హారర్ ఎలిమెంట్స్ పోటాపోటీగా నింపేశారు. క్లైమాక్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది.

నటీనటుల విషయానికి వస్తే సినిమాలో అంజలి పాత్రలో అంజలి మరోసారి ఇమిడిపోయింది. తనకు బాగా కలిసి వచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. ఇక శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. అయితే వారందరినీ సత్య తన కామెడీతో డామినేట్ చేసేసాడు. సత్య కనిపించినంత సేపు కడుపుబ్బ నవ్వుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రవిశంకర్, ప్రియా అయితే ఒక రేంజ్ లో భయపెట్టారు. రావు రమేష్ కనిపించింది తక్కువ సేపు అయినా ఉన్నంతలో తన మార్క్ కనపడేలా చూసుకున్నాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ తమ పాత్రలో పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టం దాదాపు చాలా చోట్ల కనిపిస్తుంది. అయితే గ్రాఫిక్స్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, అనవసరమైన సీన్స్ ఏమీ లేకుండా కట్ చేసుకున్నారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు బాగున్నాయి.

ఫైనల్ గా చెప్పాలంటే హారర్ కామెడీ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. బీ,సీ సెంటర్ లతో పాటు ఏ సెంటర్ ఆడియన్స్ కి కూడా నచ్చితే గీతాంజలి మ్యాజిక్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉంది .