టాలీవుడ్ లోని కొందరు హీరోలను చూస్తుంటే నక్కతోక తొక్కి వచ్చారేమో అనిపిస్తుంది. ఫ్లాపులతో నిమిత్తం లేకుండా అలాంటి వారికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆది సాయికుమార్ కూడా ఆ జాబితాలోని హీరోనే. పదేళ్ళ కెరీర్ లో ఆది సాధించిన విజయాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఫెయిల్యూర్ మూవీస్ లిస్ట్ చాలా పెద్దది. ఈ యేడాది ప్రారంభంలోనూ ‘అతిధి దేవో భవ’ వంటి ఫ్లాప్ ను అందుకున్న ఆది సాయికుమార్ తాజాగా ‘బ్లాక్’ అనే సినిమాతో జనం ముందుకు వచ్చాడు. పూరి జగన్నాథ్ శిష్యుడు జి. బి. కృష్ణ డైరెక్షన్ లో మహంకాళి దివాకర్ ఈ సినిమాను నిర్మించారు.
అర్జున్ – ఆదిత్య కవల పిల్లలు. ఆదిత్య చేసిన ఓ దొంగతనం కారణంగా పదేళ్ల వయసులోనే అర్జున్ ఇల్లు వదిలి పారిపోతాడు. తండ్రి కోరిక మేరకు పెరిగి పెద్దయిన తర్వాత ఆదిత్య (ఆది సాయికుమార్) పోలీస్ కానిస్టేబుల్ అవుతాడు. తల్లి (ఆమని)తో కలిసి ప్రశాంతంగా జీవిస్తున్న అతనికి ఊహించని ఎదురుదెబ్బ తగులుతుంది. పదిహేళ్ళ క్రితం తనను వదిలి వెళ్ళిపోయిన సోదరుడు అర్జున్ తనపై దాడి చేసినట్టు గుర్తిస్తాడు. అర్జున్ ఎందుకిలా తనపై పగ పట్టాడో అర్థం కాక ఆదిత్య సతమతమౌతుంటే… ఇది చాలదన్నట్టు దొంగతనం, హత్య కేసులోనూ అతను ఇరుక్కుంటాడు. ప్రేమించిన అమ్మాయి హానిక (దర్శన బానిక్) సైతం ఇష్టం లేకుండా ఆదిత్య తనని ముద్దుపెట్టుకున్నాడని, దాన్ని చూసిన తండ్రి తనతో గొడవ పడ్డాడని ఆరోపిస్తుంది. తనలానే ఉండే అర్జున్ ఇవన్నీ చేశాడని ఆదిత్య భావిస్తాడు. కానీ అక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. నిజానికి ఆదిత్య అనుకుంటున్నట్టుగా అతని సోదరుడు అర్జున్ ఇల్లు వదిలి పారిపోయిన రోజునే యాక్సిడెంట్ లో చనిపోతాడు. తల్లి ద్వారా ఈ నిజం తెలుసుకుని ఆదిత్య షాక్ కు గురవుతాడు. మరి ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలకు ఎవరు బాధ్యులు? ఎందుకు వారు ఇదంతా చేశారు? ఆదిత్య ఈ పన్నాగం నుండి బయట పడ్డాడా లేదా? అనేది మిగతా కథ.
లవర్ బోయ్ ఇమేజ్ ఉన్న ఆది సాయికుమార్ కొంత కాలంగా దాని నుండి బయట పడాలని చూస్తున్నాడు. అందుకోసం భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని ప్రయోగాలకు సిద్ధపడుతున్నాడు. అయితే అందులో అధిక శాతం సినిమాలు అతనికి చేదు అనుభవాలనే మిగుల్చుతున్నాయి. దర్శకుల అనుభవ రాహిత్యం కూడా అందుకు కారణం. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఓ చక్కని పాయింట్ ను సింపుల్ గా తెర మీద చూపించకుండా దర్శకుడు అనేకానేక లేయర్స్ లో స్టోరీ చెప్పాలని తాపత్రయ పడి కుప్పుస్వామి మేడ్ డిఫికల్ట్ అనే రీతిలో దీన్ని తెరకెక్కించాడు. పాండు అన్నను రావత్ చంపటం, రావత్ తమ్ముడు దాదుని పాండు చంపాలనుకోవడం, యాభై లక్షల చోరి, అడుక్కునే వాడి దగ్గర ఆ మొత్తం దొరకడం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఛేదించడానికి ఎస్.ఐ. విహన్ వర్మ (కౌశల్) రావడం… ఇదంతా కంగాళిగా అనిపిస్తుంది. దీనికి తోడు స్లీప్ వాక్ డిజార్డర్, దాని మీద డాక్టర్ సలహాలు సంప్రదింపులు ఇవన్నీ ఎక్కడో మొదలైన కథను మరెక్కడికో తీసుకుపోతాయి. మొత్తంగా తెర మీద కనిపించే ఏ సన్నివేశంతోనూ ప్రేక్షకుడు కనెక్ట్ కాలేని పరిస్థితి. ఎలాగొలా ఈ మొత్తం వ్యవహారాన్ని భరించి, శుభం కార్డు పడిందని సంతోషించే లోపే… అసలు కథ ఇప్పుడే మొదలైందనే కార్డు ఒకటి! అయితే ఈ సినిమా రిజల్డ్ తర్వాత దీనికి సీక్వెల్ వస్తుందనే నమ్మకం ఎవరికీ కలగదు.
నటీనటుల విషయానికి వస్తే ఆది సాయికుమార్ కానిస్టేబుల్ పాత్రకు పెద్దగా సూట్ కాలేదు. అయితే గతంలో కంటే యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. రామకృష్ణ నేతృత్వంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు బాగున్నాయి. ఎస్. ఐ. విహన్ వర్మ గా కౌషల్ నటించాడు. అవసరమైన బిల్డప్ తప్పితే అతను సాల్వ్ చేసే సమస్య ఏదీ ఇందులో ఉండదు. ఆ మధ్య వచ్చిన ‘అతడు ఆమె ప్రియుడు’లోనూ కౌశల్ చక్కని నటన ప్రదర్శించాడు. కానీ ఈ రెండు సినిమాలూ అతనికి నిరాశను కలిగించాయనే చెప్పాలి. హీరోయిన్ దర్శన బానిక్ పాత్రకు ఇందులో పెద్దంత ప్రాధాన్యం లేదు. అయితే రావత్ గా నటించిన వ్యక్తి యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్ బాగున్నాయి. ‘పెళ్ళి’ ఫేమ్ పృథ్వీరాజ్ డాక్టర్ గానూ, ఆమని హీరో తల్లిగానూ కీలక పాత్రలు పోషించారు. సూర్య, సత్యం రాజేశ్, తాగుబోతు రమేశ్, మధునందన్, ఆనంద చక్రపాణి తదితరులు ఇతర పాత్రలలో కనిపిస్తారు. సతీశ్ ముత్యాల సినిమాటోగ్రఫీ, సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం బాగున్నాయి. అమర్ రెడ్డి ఎడిటింగ్ పూర్ గా ఉంది. సినిమా అయిపోయిందని అంతా భావిస్తున్న తరుణంలో మరో పది నిమిషాల కథను నడిపారు. ప్రేక్షకులకు కూడా స్లీప్ వాక్ డిజార్డర్ ఉండి ఉంటే, థియేటర్ లోని సగం జనం బయటకు వెళ్ళిపోయేవారేమో! ఆది సాయికుమార్ కథల ఎంపిక విషయంలోనే కాదు డైరెక్టర్స్ సెలక్షన్ లోనూ జాగ్రత్త పడకపోతే… కెరీర్ ముందుకు సాగడం కష్టం.
రేటింగ్ : 2 /5
ప్లస్ పాయింట్స్
ఎంచుకున్న అంశం
యాక్షన్ సీన్స్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనెస్ పాయింట్స్
ఓవర్ బిల్డప్
అర్థం లేని సాగతీత
దర్శకుడి అనుభవ రాహిత్యం
ట్యాగ్ లైన్: మైండ్ బ్లాంక్!