సినిమా పైరసీ కేసుల్లో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి కస్టడీ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇప్పటికే రవిని విచారించేందుకు కోర్టు కేటాయించిన సమయం సరిపోదని పేర్కొంటూ, పోలీసులు తాజాగా రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. రవిపై నమోదైన మూడు కేసుల్లో ఒక్కో కేసుకు ఒక రోజు చొప్పున మొత్తం మూడు రోజులు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ కొద్దిపాటి సమయం లోతుగా విచారణ చేయడానికి ఏ మాత్రం సరిపోదని పోలీసులు తమ రివిజన్ పిటిషన్‌లో స్పష్టం చేశారు.
Also Read :Akhanda 2: తెరపైకి కొత్త డేట్.. డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం?
రవిపై నమోదైన మొత్తం నాలుగు కేసుల్లోనూ సమగ్ర విచారణ జరిపేందుకు వీలుగా ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ కస్టడీ ద్వారా ఐబొమ్మ రవిని ప్రధానంగా నాలుగు సినిమాల పైరసీకి సంబంధించి లోతుగా ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. “కుబేర”, “కిష్కింద పురి”, “తండేల్”, మరియు “హిట్” వంటి ప్రముఖ చిత్రాల పైరసీ వ్యవహారాలపై రవి నుంచి మరిన్ని కీలక సమాచారాన్ని రాబట్టడానికి ఈ అదనపు కస్టడీ అవసరమని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ రివిజన్ పిటిషన్‌పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందో, పోలీసులు అడిగిన అదనపు కస్టడీ సమయం లభిస్తుందో లేదో తెలియాల్సి ఉంది.