3BHK Review : సిద్ధార్థ హీరోగా నటించిన దాదాపు అన్ని చిత్రాలు తెలుగులో కూడా విడుదల అవుతూ ఉంటాయి. అందులో భాగంగానే ‘3 బిహెచ్‌కె’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని సిద్ధార్థ తల్లిదండ్రులుగా నటించగా, మీతా రఘునాథ్ ఆయన చెల్లెలి పాత్రలో నటించింది. చైత్రా ఆచార్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ :
వాసుదేవ్ (శరత్ కుమార్), శాంతి (దేవయాని) దంపతులకు ప్రభు (సిద్ధార్థ), ఆర్తి(మీతా రఘునాథ్) పిల్లలు. వాసుదేవ్ ఉద్యోగం చేయడం ప్రారంభించిన నాటి నుంచి సొంత ఫ్లాట్ కొనుక్కోవడం వారి కల. ప్రభు ఎస్‌ఎస్‌సీ చదువుతున్నప్పటి నుంచి బీటెక్ పూర్తి చేసే వరకు, అలాగే ప్రభు పెళ్లి అనుకున్న సమయంలో కూడా వాసుదేవ్ కుటుంబం అనేక సార్లు ఫ్లాట్ కొనుక్కోవాలని భావించినా అది సాధ్యం కాలేదు. అయితే, ఎందుకు అలా సాధ్యం కాలేదు? ప్రభుతో వాసుదేవ్ ఎందుకు మాట్లాడటం మానేశాడు? ఐశ్వర్య(చైత్ర)తో ప్రభు ప్రేమ ఎంతవరకు వెళ్లింది? ఇంతకీ ఇల్లు కొన్నారా లేదా అనేది తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
విశ్లేషణ;
రోటీ, కపడా, మకాన్ అని చిన్నప్పుడు అందరూ చదువుకునే ఉంటారు. కడుపు నిండా తిండి, మంచి వస్త్రాలు, తర్వాత ఎవరైనా ఆలోచించేది ఒక మంచి ఇంటి గురించే. మరీ ముఖ్యంగా మధ్యతరగతి వారైతే, ఎప్పటికైనా సొంత ఇంటిని ఏర్పరచుకోవాలని చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఒకానొక సమయంలో ఊళ్లలో ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేసేవారు, కానీ ఇప్పుడు ఆ కల్చర్ అపార్ట్‌మెంట్‌లకు పాకింది. అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ అయినా ఉండాలని ఆలోచించని మధ్యతరగతి వ్యక్తి ఉండడు. ఆ ఎమోషన్‌నే క్యాష్ చేసుకునేలా ఈ సినిమా చేశారు. సొంత ఇంటిని ఏర్పరచుకోవడానికి వాసుదేవ్ చేసే పోరాటమే ఈ ‘త్రీ బిహెచ్‌కె’ సినిమా. సొంత ఇంటి కల అందరికీ ఉంటుంది. దానికి తోడు ఇద్దరు పిల్లలు ఉంటే, వారిని చదివించడం, ప్రయోజకులుగా తీర్చిదిద్దడం లాంటి బాధ్యతలు కూడా ఉంటాయి. వారి స్కూల్ ఫీజులు, కాలేజీ చదువులకు డబ్బులు వంటివి తలకు మించిన భారంగా నిలుస్తూ ఉంటాయి. సొంత ఇంటి కలను పక్కన పెడితే, మధ్యతరగతి జీవనశైలి, వారి ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎలాంటి త్యాగాలు చేస్తారు, వారి ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది అనే విషయాలను సినిమాలో ప్రధానంగా చర్చించారు. ఒక మాటలో చెప్పాలంటే, ఈ సినిమాలో చూపించిన ఎమోషన్ కానీ, అందులో వచ్చే సన్నివేశాలు కానీ తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం కొత్త కాదు. అదే తరహా సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ చివరికి వచ్చేసరికి “ఇదేంట్రా, కష్టాలు ఇంతలా ఉన్నాయి” అనే ఫీలింగ్ కలుగుతుంది. తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని సినిమాలను పోలి ఉండేలా ఈ సినిమా ఉంటుంది. తండ్రి చెప్పింది కాకుండా తాను చేయాలనుకున్నది చేసి సిద్ధార్థ సక్సెస్ అవుతాడు, దాంతో సినిమా ముగుస్తుంది. తమిళ ప్రేక్షకులకు ఇలాంటి కథలు కొత్త కాకపోవచ్చు, తెలుగులో అయితే కచ్చితంగా కొత్త కాదు. కాబట్టి ఈ సినిమా కొందరికి బాగా కనెక్ట్ అయితే, కొందరికి రొటీన్ అనిపించొచ్చు.
నటీనటుల విషయానికి వస్తే, సిద్ధార్థ ఎప్పటిలాగే తనదైన పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. వాసుదేవ్ పాత్రలో శరత్ కుమార్ కూడా కీలకమైన సన్నివేశాల్లో ఒక రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక మీతా రఘునాథ్ మధ్యతరగతి చెల్లెలుగా కరెక్ట్‌గా సూట్ అయింది. చైత్రా ఆచార్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగతా నటీనటులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ కష్టం దాదాపు ప్రతి ఫ్రేమ్‌లో కనిపించింది. సినిమాటోగ్రఫీ కరెక్ట్‌గా మూడ్ సెట్ చేసింది. తెలుగు డైలాగులు కూడా రియాలిటీకి దగ్గరగా రాసుకున్నాడు రాకేందు మౌళి. అయితే, ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్‌లో ఈ సినిమా లాంటి స్లో పేసింగ్ నరేషన్ ఉన్న సినిమాలు కామన్ ఆడియన్స్‌కి కనెక్ట్ కావడం కాస్త కష్టమే. కానీ, కామన్ మ్యాన్‌కి కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా రాసుకున్నారు కాబట్టి, కొంతమందికి బాగా కనెక్ట్ అవ్వవచ్చు.
ఫైనల్లీ ఈ ‘త్రీ బిహెచ్‌కె’ కమర్షియల్‌కి దూరంగా, స్లో నరేషన్‌తో ఉన్న ఎమోషనల్ మూవీ.